కాకినాడ పోర్ట్ రేషన్ బియ్యం స్మగ్లింగ్‌లో సూర్యాపేట పోలీసుల పాత్ర? ఆ 11 మందిపై వేటు పడేనా..?
‘పటేల్ పట్వారి నాదిక్కుంటె ఎట్టెట్ట కొడుతావో కొట్టురా మొగడా..’ అన్న చందంగా మారింది సూర్యాపేట జిల్లాలోని కొంత మంది పోలీస్ అధికారుల పనితీరు..
దిశ, వెబ్‌డెస్క్: ‘పటేల్ పట్వారి నాదిక్కుంటె ఎట్టెట్ట కొడుతావో కొట్టురా మొగడా..’ అన్న చందంగా మారింది సూర్యాపేట జిల్లాలోని కొంత మంది పోలీస్ అధికారుల పనితీరు.. ఏం జరుగుతుందో అందరికీ తెలుసు.. కానీ అడిగే వారు లేనంత వరకు దోసుకునే వాడిదే ముల్లె అన్నట్టు ఏకంగా రూ.100 కోట్లకు మీదనే మూట కట్టుకున్నారనే విమర్శలు జిల్లాలో గట్టిగా వినిపిస్తున్నాయి. రూ.100 కోట్ల కుంభకోణం అంటే ఏ బంగారమో అనుకునేరు.. పేద ప్రజల నోటి కాడి బువ్వను గుంజుకున్నారు.. అవును... పేద ప్రజలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ చేస్తుంటే కంచంలో బువ్వను కాకి వచ్చి తన్నుకుపోయినట్టు అక్రమార్కులు తన్నుకు పోతుంటే అరికట్టాల్సిన పోలీసులే అండగా నిలిచారు.
అంతా ఆ ఎస్ఐ కనుసన్నల్లోనే..
గత ప్రభుత్వం హయాంలో బీఆర్ఎస్ పార్టీ బడా లీడర్ల అండతో జిల్లా నుంచి భారీగా పీడీఎస్ బియ్యాన్ని కాకినాడ పోర్ట్‌కు తరలించారనే ఆరోపణలు జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి. అయితే వారికి అప్పట్లో జిల్లాలోని కొంతమంది పోలీసులే అండగా నిలవడంతో వారి దందా యథేచ్ఛగా సాగిందనది జిల్లా ప్రజల మాట. ఆ దందాలో కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు అందరికీ ముడుపులు అందాయనే విమర్శలు లేకపోలేదు. ముఖ్యంగా జిల్లాలోని అప్పటి పై అధికారుల అండతోనే కొంతమంది ఎస్సైలే అక్రమార్కులకు అండగా నిలిచారనే విమర్శలు గుప్పుమన్నాయి. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న ఓ పోలీస్ స్టేషన్‌లో గతంలో పని చేసిన ఎస్సై ఈ దందాకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని తానే అయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి విమర్శల నేపథ్యంలోనే ఇక్కడే ఉంటే గుట్టురట్టు అవుతుందనే ముందు చూపుతో వ్యూహత్మకంగా మరోప్రాంతానికి బదిలీ పై వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ఎస్సై పై గతంలోనూ తీవ్ర విమర్శలు వచ్చాయి. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండటం, పై అధికారుల అండదండలు గట్టిగా ఉండటంతో తాను ఆడిందే ఆట, పాడిందే పాట అన్న చందంగా కోట్లలో సంపాదించారని ప్రచారంలో ఉంది. ఒక దశలో జిల్లాలోని డీఎస్పీ, సీఐ స్థాయి అధికారులను కూడా నేను చెప్పిందే వినాలి అంటూ హుకుం జారీ చేశారని ప్రచారం పోలీస్ శాఖలో వినిపించింది. తన అక్రమార్జణకు కుడకుడలోని ఓ వెంచర్‌ను అడ్డాగా మార్చుకోని పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాతోపాటు భూదందా, గంజాయి రవాణా, సివిల్ సెటిల్ మెంట్లలో సైతం ఆ ఎస్సై తలదూర్చడనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. అంతేకాకుండా కుటుంబ కలహాలతో తన వద్దకు వెళ్లిన వారిని టార్గెట్‌గా చేసుకోని బెదిరించారనే విమర్శలు ఉన్నాయి.
జిల్లా సరిహద్దుల వరకు పోలీస్ ఎస్కార్ట్
సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కాకినాడ పోర్టుకు తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని బార్డర్‌లు దాటించడానికి కొంతమంది ఎస్సైలు తమ సైరన్ వాహనాలతో ఎస్కార్ట్ నిర్వహించారానే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఫోకస్ పెట్టింది. అందులోనూ జిల్లా ఎస్పీగా సన్ ప్రీత్ సింగ్ బాధ్యతలు చేపట్టడంతో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపారు. ఇటు పోలీస్ శాఖలోనూ అవినీతి అధికారులపై సీరియస్ యాక్షన్ తీసుకోవడం ప్రారంభించారు. దీంతో ఇల్లీగల్ వ్యాపారాలకు చెక్ పెట్టినట్టయింది. అయితే ఇటీవల కాకినాడ పోర్ట్ వ్యవహారంలో జిల్లాకు చెందిన ఓ నలుగురు అక్రమార్కుల పేర్లు తెర మీదకు రావడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వీరి వెనుక పోలీసుల హస్తం ఉన్నట్లు తేలినట్టు సమాచారం. అందులో గతంలో జిల్లా కేంద్రానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన ఒక ఎస్సై ముఖ్యపాత్ర పోషిస్తూ.. అక్రమార్కులకు పెద్దన్నలా పని చేసినట్టు విచారణలో తేలినట్టు సమాచారం.. దీంతో పోలీసుల పాత్రపై ఎంక్వైరీ చేయాలని మల్టీ జోన్ –2 ఐజీ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు.
సీరియస్‌గా తీసుకున్న సూర్యాపేట ఎస్పీ
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై విమర్శలు గుప్పుమనడంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయింది. జిల్లాలో వినిపిస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, ఎస్బీ, ఇంటెలిజెన్స్ ద్వారా ఎంక్వైరీ చేపట్టారు. మండలం స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారు..? వారికి ఏ విధంగా సహకరించారు..? ఎంత ముడుపులు తీసుకున్నారు..? అనే కోణంలో ఎంక్సైరీ చేసి నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. బియ్యం అక్రమ రవాణాలో ప్రస్తుతం 11 మంది పోలీసుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ముప్పును ముందే గ్రహించిన కొంతమంది పోలీసులు సూర్యాపేట జిల్లాను వదిలి పక్క జిల్లాలకు బదిలీ పై వెళ్లినట్టు సమాచారం. ఈ కుంభకోణంలో ముఖ్య పాత్ర పోషించిన ఎస్సై ప్రస్తుతం తన సొంత జిల్లాలోనే విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది..
ఆ పోలీస్‌లపై వేటు పడేనా..?
సూర్యాపేట జిల్లా నుంచి కాకినాడ పోర్ట్‌కు అక్రమంగా తరలించిన పీడీఎస్ బియ్యం దందాలో గతంలో జిల్లాలో పని చేసిన 11 మంది పోలీసులు ఉన్నట్టు సమాచారం. అయితే వీరి గుట్టురట్టు కావడంతో వారిలో భయాందోళన మొదలయినట్లు తెలుస్తోంది. దీంతో తమకున్న పలుకుబడితో ఫైరవీలు చేస్తూ జిల్లాను విడిచి వెళ్లినట్టు సమాచారం. అయితే ఇప్పుడు అక్రమ దందాపై జిల్లాలో జోరుగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో అక్రమార్కులకు అండగా నిలిచిన పోలీస్‌ల పనితీరుపై ప్రస్తుతం జిల్లా ఎస్పీ సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే తమ ఎంక్వైరీ పూర్తియినట్టు తెలుస్తుండటంతో అక్రమ దందాకు సహకరించిన పోలీస్ అధికారులపై వేటు పడుతుందా..? పెద్దల అండతో తెర వెనక సూత్రదారిలా గుట్టు చప్పుడు కాకుండా కేసును మూసివేస్తారా? అనే అనుమానాలు ప్రజల నుంచి వస్తున్నాయి. మరి వారికి ఇప్పుడున్న పోలీస్ యంత్రాంగ సపోర్ట్ చేస్తుందా...? లేకుంటే తమ్ముడు తన వాడైనా ధర్మం తప్పు చెప్పకూడదనే సూత్రాన్ని పాటిస్తుందా..? అనేది తెలియాలంటే వేచి చూడక తప్పదు.