వెజిటేబుల్స్ వెరైటీల్లో కనిపించని తెలంగాణ

దేశానికే రోల్ మోడల్ అని చెప్పుకుంటున్న తెలంగాణకు తాజాగా ఐకార్ (ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) ఐఐవీఆర్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వెజిటేబుల్ రీసెర్చ్)

Update: 2022-10-13 17:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దేశానికే రోల్ మోడల్ అని చెప్పుకుంటున్న తెలంగాణకు తాజాగా ఐకార్ (ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) ఐఐవీఆర్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వెజిటేబుల్ రీసెర్చ్) వారణాసి విడుదల చేసిన నూతన కూరగాయల వెరైటీల్లో చోటు లేకపోవడం గమనార్హం. ఏఐసీఆర్‌పీ (ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్) దేశంలో 26 కూరగాయల పంటల్లో 526 కొత్త కూరగాయల రకాలను సాగుచేసుకోవచ్చని సూచించింది. ఇందులో 309 ఓపీ వెరైటీలు, 163 హైబ్రిడ్, 54 ఓపీ మరియు హైబ్రిడ్ సామర్ధ్యం కలిగిన రకాలను సూచించింది. కొత్త విత్తన రకాలు, హైబ్రిడ్ రకాలను సూచించిన ఐకార్ పలు రాష్ట్రాలను కూరగాయల సాగులో ముందంజలో ఉన్నాయని పేర్కొన్నది. కానీ రాష్ట్రాల జాబితాలో తెలంగాణను పేర్కొనకపోవడం రాష్ట్ర ప్రభుత్వ స్వయంకృతాపరాధమనే తెలుస్తోంది.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో గతంలో 3 నుంచి 4 లక్షల ఎకరాల్లో సాగైన కూరగాయల సాగు ప్రస్తుతం లక్ష ఎకరాల్లో సాగవ్వడం గగనంగా మారింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 10.43 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో కూరగాయల పంటలు సాగవుతుండగా, 187.47 మిలియన్ టన్నుల వెజిటేబుల్స్ దిగుబడి వస్తున్నాయి. కాగా కూరగాయల సాగు, ఉత్పత్తుల్లో చైనా 46.72 శాతంతో ముందు వరుసలో ఉండగా, ఇండియా 14.47 శాతంతో ఉన్నది. ఇతరత్రా దేశాలు 23.95 శాతంతో కూరగాయల పంటలను ఉత్పత్తి చేస్తున్నాయి. భారతదేశంలో 1951 ఏడాదిలో 16.50 శాతంగా ఉన్న ప్రొడక్షన్, 2018 నాటికి 187.4 శాతానికి చేరిందని ఐకార్ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది.

తెలంగాణ ప్రభుత్వ నోటిఫైడ్ రకాలు లేకనే..

ఐకార్ విడుదల చేసిన జాబితాలో ఉత్తర్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మధ్య ప్రదేశ్ మొదటి మూడుస్థానాల్లో ఉండగా, నాలుగో స్థానంలో బీహార్ ఉన్నది. దిగువన తమిళనాడు, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలున్నాయి. కానీ ఈ జాబితాలో తెలంగాణ లేకపోవడం గమనార్హం. అయితే ఇందుకు కారణం ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ నోటిఫైడ్ కూరగాయల విత్తన రకాలతో పాటు ప్రైవేటు, హైబ్రిడ్ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ తెలంగాణ ఏర్పడి 8 ఏండ్లు అవుతున్నా ఇప్పటివరకు కూడా కూరగాయల విత్తన రకాల్లో ప్రభుత్వ నోటిఫైడ్ సీడ్స్ లేకపోవడం, ఎక్కువగా హైబ్రిడ్, ప్రైవేటు రకాలే అందుబాటులో ఉండడంతో ఐకార్ తెలంగాణను జాబితాలో చేర్చలేదని తెలుస్తోంది. అయితే రాష్ట్ర ఉద్యానవన శాఖ అధికారులు సైతం నిర్లక్ష్యం వహిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ నోటిఫైడ్ విత్తన రకాలున్నాయా లేదా అన్న వివరాలను అందించకపోవడం కూడా ఇందుకు ఒక కారణంగా కనబడుతోంది. ఐకార్ ప్రతినిధులు వివరాలు అడిగిన సమయంలో 'మా దగ్గర ఎక్కువగా ప్రైవేటు, హైబ్రిడ్ సీడ్స్' మాత్రమే ఉన్నాయని సమాధానం ఇస్తున్నారని తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల నేపథ్యంలో రాష్ట్రంలో కూరగాయల సాగు ఉన్నా.. లేదన్నట్టు పరిస్థితులు మారిపోయాయి. మరి ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి.


Similar News