ప‌ర్యాట‌క అభివృద్ధికి స‌హ‌కరించండి.. స్పెయిన్ రాయ‌బారికి మంత్రి జూప‌ల్లి రిక్వెస్ట్

తెలంగాణ ప‌ర్యాట‌క రంగాన్ని ప్రోత్సహించేందుకు స‌హ‌కారం అందించాల‌ని స్పెయిన్ రాయ‌బారి హువ‌న్ అంతోనియో మార్సో పుజోల్‌ను ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కోరారు.

Update: 2024-09-20 09:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప‌ర్యాట‌క రంగాన్ని ప్రోత్సహించేందుకు స‌హ‌కారం అందించాల‌ని స్పెయిన్ రాయ‌బారి హువ‌న్ అంతోనియో మార్సో పుజోల్‌ను ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కోరారు. శుక్రవారం డా.బీఆర్. అంబేద్కర్ స‌చివాల‌యంలో మంత్రి జూప‌ల్లి కృష్ణారావును.. హువ‌న్ అంతోనియో మార్సో పుజోల్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఇరు ప్రాంతాల ప‌ర్యాట‌క రంగాల‌పై చ‌ర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌ల మేర‌కు.. ఘ‌న‌మైన తెలంగాణ‌, చరిత్ర‌, సంస్కృతి, వార‌స‌త్వం కేంద్ర‌గా ప‌ర్యాటకాన్ని మ‌రింత అభివృద్ధి చేసేందుకు ప్ర‌పంచ స్థాయి మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న ల‌క్ష్యంగా ముందుకెళ్తున్నట్లు మంత్రి జూప‌ల్లి ఈ సంద‌ర్భంగా పుజోల్‌కు వివ‌రించారు.

ప్ర‌పంచ దేశాల మ‌ధ్య సంస్కృతి, సాంప్ర‌దాయ‌ల మార్పిడికి ప‌ర్యాట‌కం రంగం వార‌ధిగా నిలుస్తుంద‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటు, వారసత్వాన్ని కాపాడుకునేందుకు.. వివిధ దేశాలతో కలిపి థీమ్ ఆధారిత సర్క్యూట్‌లపై దృష్టి పెట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. తెలంగాణ ప‌ర్యాట‌క రంగాన్ని ప్రోత్స‌హించేందుకు స్పెయిన్ స‌హ‌కారం అందిచాల‌ని పుజోల్‌ను కోరారు. ఇరు ప్రాంతాల ప‌ర్యాట‌కుల‌ను ఆకట్టుకునేలా ప‌ర‌స్ప‌ర స‌హాకారంతో ముందుకువెళ్దామ‌న్నారు. రాష్ట్రంలో కొత్త‌గా నిర్మించ‌బోయే ఫోర్త్ సిటీతో విదేశీ ప‌ర్యాట‌కుల‌ను మ‌రింత ఆక‌ర్శించే అవ‌కాశం ఉంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

జీవ వైవిధ్యం, ప్రకృతితో అనుసంధానమైన జీవన విధానం వంటివి భారతదేశంలో పర్యాటకాభివృద్దికి సానుకూలమైన అంశాలని స్పెయిన్ రాయ‌బారి హువ‌న్ అంతోనియో మార్సో పుజోల్ అన్నారు. ప‌ర్యాట‌క రంగ అభివృద్ధికి త‌మ వంతు స‌హ‌కారాన్ని అందిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. ప‌ర్యాట‌కుల‌కు స్వ‌ర్గ‌దామ‌మైన స్పెయిన్‌ను సంద‌ర్శించాల‌ని మంత్రి జూప‌ల్లిని కోరారు. ఈ స‌మావేశంలో ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ మెనేజింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌కాష్ రెడ్డి పాల్గొన్నారు.


Similar News