Seethakka: మహిళలను వేధిస్తే సహించేంది లేదు.. సీతక్క హెచ్చరిక

పని చేసే చోట మహిళలకు వేధింపులపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-20 09:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళలు సమాజ సృష్టికర్తలు అని  మంత్రి సీతక్క అన్నారు.  సమాజంలో స్త్రీల పట్ల ఇంకా చిన్న చూపు చూసే మనస్తత్వం ఉందని  అందువల్లే మహిళలు వెనుకబడి ఉన్నారని అన్నారు. శుక్రవారం మాదాపూర్‌ టెక్ మహీంద్రా లెర్నింగ్ వరల్డ్‌లో తెలంగాణ సీఐఐ ఇండియన్ ఉమెన్ నెట్‌వర్కింగ్ (ఐడబ్ల్యుఎన్) నిర్వహించిన వార్షిక లీడర్‌షిప్ కాన్క్లేవ్ 2024 10వ ఎడిషన్‌లో సీతక్క పాల్గొని మాట్లాడారు. ఉన్నత స్థానాల్లో ఉన్న స్త్రీలు తోటి మహిళకు తగిన ప్రోత్సాహం అందించాలని సూచించారు. పని ప్రదేశాలలో మహిళల వేధింపులపై స్పందిస్తూ.. పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులను సహించేది లేదని హెచ్చరించారు. వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు ధైర్యంగా ముందుకురావాలని పిలుపునిచ్చారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పని ప్రదేశంలోనే మహిళలకు రక్షణ లేకుంటే ఇంకా వారెక్కడ సురక్షితంగా ఉంటారని ప్రశ్నించారు. పారిశ్రామికవేత్తలు నగరాలకే పరిమితం కాకూడదని గ్రామీణ పారిశ్రామికవేత్తలు ఎదిగినప్పుడే సమాజంలో అంతరాలు తగ్గుతాయన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు ఆమె పిలుపునిచ్చారు. దీని వల్ల మరింత ఉపాధి అవకాశాలు పెరిగి నిరుద్యోగం తగ్గుతుందన్నారు. మహిళల రక్షణ కోసం ఇటీవల ప్రభుత్వం టీ సేఫ్ యాప్ ను తీసుకొచ్చిందని గుర్తు చేశారు.


Similar News