ఏపీ కేడర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ లను కొంతకాలం పాటు ఇక్కడే పనిచేసే వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.

Update: 2024-10-12 01:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ లను కొంతకాలం పాటు ఇక్కడే పనిచేసే వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ల వ్యవహారాలను పర్యవేక్షించే డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైయినింగ్ కు లేఖ రాయాలని సీఎస్ శాంతికుమారిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం. ఏపీకి రిలీవ్ కావాల్సిన ఆఫీసర్లలో చాలా మంది కీలక విభాగాల్లో పనిచేస్తున్నారు. దీంతో సదరు అధికారులను వెంటనే రిలీవ్ చేయడం వల్ల పాలనాపరమైన ఇబ్బందులు వస్తాయనే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సెక్రటేరియట్ వర్గాల సమాచారం.

కొంత టైమ్ ఇవ్వండి

రాష్ట్ర విభజనలో భాగంగా ఏపీకి కేటాయించిన ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు వెంటనే అక్కడ రిపోర్టు చేయాలని కేంద్రం ఆదేశించడంతో సదరు ఐఏఎస్, ఐపీఎస్ లకు టెన్షన్ పట్టుకున్నది. ఉన్నపళంగా ఇక్కడి నుంచి పంపుతారేమోననే ఆందోళన మొదలైంది. అయితే ప్రభుత్వం మాత్రం సదరు ఆఫీసర్లు కొంతకాలంపాటు ఇక్కడే పనిచేసే విధంగా వెసులుబాటు ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నట్టు తెలుస్తున్నది. ఏపీ కేడర్ ఆఫీసర్లు ఈనెల 16న రిపోర్టు చేయాలని గురువారం డీఓపీటీ ఆదేశించిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సీఎంఓ అధికారులు తీసుకెళ్లినట్టు సమాచారం. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫీసర్లను రిలీవ్ చేయడం వల్ల పాలనాపరమైన ఇబ్బందులు వస్తాయనే అభిప్రాయానికి సీఎం వచ్చినట్టు తెలిసింది. అయితే సదరు ఆఫీసర్లను కొంతకాలంపాటు ఇక్కడే పనిచేసేందుకు అవకాశం ఇవ్వమంటూ, కేంద్రానికి లేఖ రాయాలని సీఎస్ ను రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది.

కేంద్రం సమ్మతించకుంటే ఏపీకి రిక్వెస్ట్?

ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లను మరికొంతకాలంపాటు రాష్ట్రంలో పనిచేసేందుకు కేంద్రం వెసులుబాటు ఇవ్వకపోతే ఆల్టర్నేటివ్ మార్గాలపై కూడా ఆలోచన చేస్తున్నది. ఒకవేళ కేంద్రం రాజకీయ కోణంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పీలును తిరస్కరిస్తే ఏపీ సర్కారుకు లేఖ రాయాలని భావిస్తున్నట్టు సమాచారం. డీఓపీటీ నిర్ణయం మేరకు సదరు ఆధికారులు ఏపీలో రిపోర్టు చేయగానే, తమకు కావాల్సిన ఆఫీసర్లను ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్ ద్వారా ఇక్కడికి తెచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్ విషయంలో కేంద్రం అనుమతి అవసరంలేదు. సమాచారం ఇస్తే సరిపోతుందనే అభిప్రాయాలు ఐఏఎస్ వర్గాల్లో ఉన్నాయి.

కీలక విభాగాల్లో ఐఏఎస్‌లు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని కీలక శాఖల్లో పట్టుకోసం తమకు నమ్మకస్తులైన ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించింది. రోనాల్డ్ ట్రాన్స్ కో, జెన్కో ఎండీగా, అమ్రపాలి జీహెచ్ఎంసీ కమిషన్ గా, వాకాటి కరుణ ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా,వాణి ప్రసాద్ అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వీరిని వెంటనే రిలీవ్ చేయకుండా, మరికొంత కాలంపాటు రాష్ట్రంలో పనిచేసేందుకు వెసులుబాటు ఇవ్వాలని కోరేందుకు సీఎస్ సిద్ధమైనట్లు తెలిసింది.


Similar News