తీగల సరే...మామా అల్లుళ్ల దారేటు?

తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ బలోపేతంపై దృష్టి పెట్టిన ఆ పార్టీ అధినేత..ఏపీ సీఎం చంద్రబాబు ఎట్టకేలకు ఓ మాజీ ఎమ్మెల్యేను సైకిల్ ఎక్కించడం ద్వారా పార్టీ విస్తరణలో తొలి అడుగు వేసినట్లయ్యింది.

Update: 2024-10-07 09:40 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ బలోపేతంపై దృష్టి పెట్టిన ఆ పార్టీ అధినేత..ఏపీ సీఎం చంద్రబాబు ఎట్టకేలకు ఓ మాజీ ఎమ్మెల్యేను సైకిల్ ఎక్కించడం ద్వారా పార్టీ విస్తరణలో తొలి అడుగు వేసినట్లయ్యింది. సోమవారం టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన హైదరాబాద్ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేరనున్నట్లుగా ప్రకటించారు. అయితే తీగలతో పాటు చంద్రబాబును కలిసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడైన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాత్రం టీడీపీలో చేరిక విషయమై సమాధానాన్ని ధాటవేశారు. అయితే మీడియాతో తాను టీడీపీలో వందశాతం చేరతానంటూ తీగల కృష్ణారెడ్డి ప్రకటించిన సమయంలోనే.. ఆయన పక్కనే మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. కానీ టీడీపీలో చేరిక వ్యవహారంపై స్పందించడానికి నిరాకరించారు. మల్లారెడ్డిని మీడియా వెంటబడి ప్రశ్నిస్తే... తాను తన (మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు) మనవరాలి పెళ్లికి ఆహ్వానించడానికే చంద్రబాబును కలిసినట్టు పేర్కొన్నారు. ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడను అని.. ఆ తర్వాత ఏదైనా ఉంటే చెబుతాం అంటూ మల్లారెడ్డి చెప్పి వెళ్ళారు. కానీ తీగల, మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు అంతా ఒకేసారి చంద్రబాబుతో సమావేశం అయ్యారు. తీగల కృష్ణారెడ్డి.. టీడీపీలో చేరడం ఖాయం అయిపోగా.. మల్లారెడ్డి అడుగులు ఎటువైపు పడతాయనేది చర్చగా మారింది.

టీడీపీలోనే రాజకీయ జీవితం ప్రారంభించిన మల్లారెడ్డికి.. ఆయన కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో మంచి అనుబంధం ఉంది. రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. మల్లారెడ్డి.. ఆయన అల్లుడు.. ఇలా ఆయన కుటుంబం మొత్తం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరుతుందా? అనే చర్చగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో ఆ పార్టీకి జోష్ వస్తుందని మల్లారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు సాగుతున్నాయని, తమ ఆస్తులపైన, విద్యాసంస్థలపైన వేధింపులు సాగుతున్నాయని మామాఅల్లుళ్లు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు ఆరోపిస్తున్నారు. వారి ఇంజనీరింగ్ కళాశాలలకు సీట్ల పెంపుకు అనుమతి నిరాకరించడంతో పాటు, వారి విద్యా సంస్థలు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఉన్నాయని, వచ్చే అకాడమిక్ నాటికి కూల్చి వేయాలని ఇప్పటికే హైడ్రా నోటీసులిచ్చింది.

తమపై కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దాడులు తగ్గాలంటే అధికారంలో ఉన్న పార్టీలో చేరుతానని తన అనుచరులతో మల్లారెడ్డి చెబుతున్నట్లు తెలుస్తోంది. టీటీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉండటంతో మల్లారెడ్డి ఈ పదవీపై దృష్టి పెట్టినట్లుగా కథనాలు వినబడుతున్నాయి. చంద్రబాబుతో భేటీలో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో డీలా పడిన టీడీపీకి పూర్వ వైభవం తెచ్చే విషయంతో పాటు చేరికల అంశంపై మంతనాలు సాగినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. టీడీపీలో ఉండి హైదరాబాద్ మేయర్ గా పనిచేసిన తీగల కృష్ణారెడ్డి..2014లో మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. 2018ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడారు. ఇక, గత ఎన్నికల సమయంలో ఆయన.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు మరోసారి టీడీపీలో చేరనున్నట్లుగా ప్రకటించారు. 


Similar News