ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లో చేరిన కీలక నేత..!

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి రాకతో మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్‌కు వంద ఏనుగుల బలం వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు.

Update: 2023-10-20 10:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి రాకతో మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్‌కు వంద ఏనుగుల బలం వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం కేటీఆర్ సమక్షంలో అనుచరులతో కలిసి రావుల చంద్రశేఖర్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రావులకు కండువా కప్పి ఆహ్వానించడం తన అదృష్టంగా భావిస్తానని అన్నారు. రావుల అజాత శత్రువుకు నిజమైన పర్యాయ పదమని కొనియాడారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మమ్మల్ని దొరల పాలన అంటున్నారు.. వాళ్ల నానమ్మ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి రాచి రంపాన పెట్టారు.. వాళ్ళు కూడా దొరల పాలన గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్‌కు అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు ఉందా అని ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పుట్టు పూర్వోత్తరాలు పాలమూరు ప్రజలకు తెలుసని.. హంతకుడే సంతాప సభ పెట్టినట్టు ఉంది రేవంత్ తీరని సెటైర్ వేశారు. వచ్చే ఎన్నికల్లో ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

అనంతరం రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ దూర ద్రుష్టి గల నేత అని ప్రశంసించారు. పాలమూరు అభివృద్ధి, ప్రజా సేవ కోసం బీ ఆర్ఎస్ లో చేరుతున్నానని స్పష్టం చేశారు. ఏ పదవిని ఆశించడం లేదన్నారు. కేసీఆర్ రెండు టెర్ముల్లో అభివృద్ధి బాగా జరిగిందని.. ఆయనకు మరోసారి అవకాశ మిస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్‌లో చేరుతున్నానని అన్నారు. బీఆర్ఎస్ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

Tags:    

Similar News