సందిగ్ధంలో రేవంత్ రెడ్డి.. సస్పెన్స్‌కు AICC తెర దించేనా..?

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేపట్టబోయే పాదయాత్రపై సస్పెన్స్ నెలకొంది.

Update: 2023-01-16 05:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేపట్టబోయే పాదయాత్రపై సస్పెన్స్ నెలకొంది. అదే రోజున జాతీయ స్థాయిలో 'హాత్ సే హాత్ జోడో అభియాన్' ప్రోగ్రామ్ కూడా ప్రారంభమవుతుంది. తెలంగాణలోనూ లాంఛనంగా భద్రాచలంలో మొదలు కానుంది. ఇందులో పీసీసీ చీఫ్ రేవంత్ సహా పార్టీ సీనియర్ నేతలంతా పాల్గొంటారు. ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్ లోనూ యాత్రను స్థానిక నేతలు నిర్వహించేలా ఇప్పటికే ఏఐసీసీ ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఏఐసీసీ పిలుపు కావడంతో విభేదాలను మరిచి తమ నియోజకవర్గాల్లో నేతలు, కార్యకర్తలు, శ్రేణులు పాదయాత్ర చేపడతారు.

చేవెళ్ల సెంటిమెంట్ తోనే..

దేశవ్యాప్తంగా ప్రోగ్రామ్ ఫిక్స్ కాకముందే రాష్ట్రంలో పాదయాత్ర చేయనున్నట్లు రేవంత్‌రెడ్డి అప్పట్లోనే ప్రకటించారు. హైదరాబాద్ సిటీలోని సెగ్మెంట్లలో తప్ప మిగిలిన అన్ని స్థానాలు చుట్టేయాలనేది తొలుత రూపొందిన ప్లాన్. మొత్తం 99 స్థానాల్లో 126 రోజుల పాటు రోజుకు 18 కి.మీలు పాదయాత్ర కొనసాగుతుందని వివరించారు. జోగులాంబ గద్వాల నుంచి ప్రారంభమయ్యే చాన్స్ ఉందని, ఇంకా పూర్తి షెడ్యూలు ఖరారు కాలేదని పేర్కొన్నారు. కానీ భద్రాచలం నుంచి షురూ చేయాలని అక్కడి ఎమ్మెల్యే పోదెం వీరయ్య విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ ఉన్నప్పటి నుంచి సెంటిమెంట్‌గా ఉన్న చేవెళ్ల నుంచే స్టార్ట్ చేయాలనే ప్లాన్ కూడా ఉంది.

కొత్త ఇన్ చార్జి రాకతో..

రేవంత్‌తో విభేదిస్తున్న ఏలేటి మహేశ్వరరెడ్డి పాదయాత్రకు ఏఐసీసీ అనుమతి లేదని ఓ సందర్భంలో కామెంట్ చేశారు. ఏఐసీసీ అమలు కమిటీ చైర్మన్‌గా తనకు ఢిల్లీ నేతల నుంచి అలాంటి సమాచారం రాలేదని, పాదయాత్ర ఉండకపోవచ్చని గతంలోనే పేర్కొన్నారు. అయితే.. ఆ తర్వాత 'హాత్ సే హాత్ జోడో అభియాన్' ఫిక్స్ కావడంతో రేవంత్ పాదయాత్ర ఉంటుందా..? లేదా అనే చర్చలు గాంధీ భవన్‌లో నడుస్తున్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న మాణిక్కం ఠాగూర్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మహారాష్ట్రకు చెందిన మాణిక్‌రావు థాక్రే వచ్చారు. దీంతో రేవంత్ పాదయాత్ర ప్లాన్ పురోగతిపై సస్పెన్స్ నెలకొంది. కొత్త ఇన్‌చార్జి మాణిక్‌రావు ఏకకాలంలో 'హాత్ సే హాత్ జోడో అభియాన్', రేవంత్ పాదయాత్ర జరిగేలా సమ్మతిస్తారా.. లేదా అనే సందేహంలో పార్టీ క్యాడర్ ఉంది.

వ్యక్తిగా చేసే దానికంటే..

'హాత్ సే హాత్ జోడో అభియాన్'ను ఏఐసీసీ ఫిక్స్ చేసినందున అది అన్ని రాష్ట్రాల్లోనూ షెడ్యూలు, ప్లానింగ్ ప్రకారం జరగాల్సిందే. రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా ప్రతిరోజూ ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌లో రేవంత్‌రెడ్డి పాల్గొనాల్సి ఉంటుంది. ఇది జరుగుతున్నప్పుడు విడిగా ప్లానింగ్ చేసిన పాదయాత్ర ఎలా కంటిన్యూ అవుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు సీనియర్లంతా రేవంత్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన సమయంలో ఒంటరిగా పాదయాత్ర చేయడంపైనా గాంధీభవన్‌లో చర్చకు వచ్చింది. కొత్త ఇన్‌చార్జి వద్ద సైతం పాదయాత్రపై కొందరు సీనియర్లు ప్రస్తావించారు. వ్యక్తిగా చేసే దానికంటే ఏఐసీసీ పిలుపు మేరకు 'హాత్ సే హాత్ జోడో అభియాన్'ను సక్సెస్ చేయడం మెయిన్ టార్గెట్ కావడంతో రేవంత్ కూడా తన అభిప్రాయం మార్చుకున్నట్లు సన్నిహితుల సమాచారం.

జనాల్లోకి వెళ్లడమే లక్ష్యంగా..

'హాత్ సే హాత్ జోడో అభియాన్'లో భాగంగానే రేవంత్ తన పాదయాత్రను ప్రతి రోజు ఒక్కో సెగ్మెంట్ లో కొనసాగిస్తారని తెలిసింది. తొలుత ప్లాన్ చేసిన పాదయాత్ర స్పిరిట్‌కు ఇది భిన్నంగా ఉంటుంది. పార్టీ ప్రోగ్రామ్‌లో భాగంగానే అభియాన్‌లో పాల్గొంటారు. అయితే ఇప్పటివరకూ జరిగిన పాదయాత్రల తరహాలో ఉండకపోవచ్చని తెలిసింది. ఏ యాత్ర చేసినా ప్రజలకు చేరువ కావడమే లక్ష్యమైనందున పాదయాత్రకు బదులుగా అభియాన్ యాత్రతోనే రేవంత్ సరిపెట్టుకునే అవకాశాలూ లేకపోలేదు. అభియాన్ లక్ష్యం పూర్తయిన తర్వాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రేవంత్ తన పాదయాత్రపై మరోసారి పునరాలోచించుకుని ప్లాన్ చేసుకునే అవకాశముంది.

Tags:    

Similar News