Deputy CM Bhatti Vikramarka : సోలార్ ప్లాంట్ ల ఏర్పాటుకు మహిళా సంఘాలకు చేయూత : భట్టి
సోలార్ విద్యుత్ ప్లాంట్ ల ఏర్పాటులో స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఇందుకోసం ఆర్థిక చేయూతను అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)తెలిపారు.
దిశ, వెబ్ డెస్క్ : సోలార్ విద్యుత్ ప్లాంట్ ల ఏర్పాటులో స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అవసరమైన ఆర్థిక చేయూతను అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)తెలిపారు. ప్రజా భవన్ లో స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ ల ఏర్పాటు ప్రగతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు కొండా సురేఖ(Konda Surekha), ధనసరి సీతక్క(Dhanasari Seethakkala)లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్(Video Conference)నిర్వహించారు. రాష్ట్రంలో రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తికి అవసరమైన అంశాన్ని అధ్యయనం చేసి ఈనెల 9న నూతన ఇంధన పాలసీ ప్రకటించనున్నామని చెప్పారు.
రాష్ట్రంలో ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక సంఘాల సమాఖ్యలు కనీసం 4వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అవసరమైన పరికరాల కొనుగోలుకు సంఘాలకు బ్యాంకు రుణాలు సమకూర్చేలా అధికారులు, బ్యాంకర్లు చొరవ తీసుకోవాలన్నారు. గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారికత, పునరుత్పత్తి ఇంధన వనరుల విస్తరణ లక్ష్యంగా మహిళా సంఘాలను ప్రోత్సహిస్తామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్ (పీఎం కుసుమ్) కార్యక్రమం ద్వారా రైతుల పొలాల్లో సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి వారికి అదనపు ఆదాయ మార్గాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుందని భట్టి తెలిపారు. ఈ పథకం కింద 0.5 మెగావాట్ల నుండి రెండు మెగావాట్ల వరకు సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఎండిపోయిన లేదా పాడుబడిన వ్యవసాయ భూములపై ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ విధంగా కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తిని చేయడంతో పాటు రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చే ప్రయత్నం చేస్తున్నామని డిప్యూటీ సీఎం వివరించారు.
రైతులు తమ భూమిని సోలార్ విద్యుత్ ప్లాంట్ అభివృద్ధి కోసం డెవలపర్లకు లీజుకు ఇచ్చుకోవచ్చునని, అయితే ఈ సందర్భంలో భూమి యజమానికి డెవలపర్లకు మధ్య డిస్కమ్‌ల ద్వారా ఒప్పంద మేరకు లీజు మొత్తం అందించబడుతుందని తెలిపారు. రైతులు, రైతు బృందాలు, సహకార సంఘాలు, పంచాయతీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజర్లు (ఎఫ్‌పిఓ), వాటర్ యూజర్ అసోసియేషన్లు (డబ్లుయుఏ) సైతం ఈ పథకం కింద దరఖాస్తు చేయవచ్చునని తెలిపారు.