AIMIM: ‘గేమ్ ఛేంజర్’గా మారడమే ఎంఐఎం టార్గెట్..! ఢిల్లీ ఎన్నికల్లో 12 స్థానాల్లో పోటీ
ఢిల్లీ రాష్ట్రంలో కింగ్ మేకర్ కావాలనే లక్ష్యంతో ఎంఐఎం దూసుకెళ్తోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ రాష్ట్రంలో కింగ్ మేకర్ కావాలనే లక్ష్యంతో ఎంఐఎం దూసుకెళ్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో పోటీ చేసిన ఎంఐఎం.. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో పోటీ చేయాలని నిర్ణయించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేయనుంది. ఇప్పటికే రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ముస్తాఫాబాద్ నుంచి తహిర్హుస్సేన్, ఓక్లా నుంచి షపాయర్ రహమాన్‌ఖాన్ కంటెస్ట్ చేయనున్నారు. వీటితో పాటుగా బాబర్పూర్, బల్లిమారన్, చాందినిచౌక్, జంగాపూర్, సదర్‌బజార్, మాటియామహాల్, కార్వాన్నగర్, సీలంపూర్ సెగ్మెంట్ల నుంచి బరిలో నిలవాలని పార్టీ నిర్ణయించింది. ఈ నియెజకవర్గాల్లో ముస్లింలు అత్యధికంగా ఉన్నట్టు గుర్తించారు. ఈ సెగ్మెంట్లలో గత రెండు టర్ముల నుంచి ఆప్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. కార్వాన్నగర్ నుంచి మాత్రం 2020లో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. రెండు స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించిన ఎంఐఎం వచ్చే వారం మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది.
అభ్యర్థుల్లో ఇద్దరు ఢిల్లీ అల్లర్లలో నిందితులు
ఎంఐఎం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో తహిర్హుస్సేన్ గతంలో ఢిల్లీ అల్లర్లలో నిందితుడిగా ఉన్నారు. మరొక నిందితుడు సోహేబ్ను ఎలక్షన్స్‌లో పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలిసింది. ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చని, ప్రజలు ఓటేసిన వాళ్లు మాత్రమే గెలుస్తారని తాము నిలిపిన క్యాండిడేట్స్ హిస్టరీపై ఎంఐఎం పార్టీ వివరణ ఇస్తోంది. ఇతర పార్టీల అభ్యర్థులు జైలుకు వెళ్లొచ్చిన వారు ఉన్నారని పేర్కొంటోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విస్తృతంగా క్యాంపెయిన్ చేయనున్నారు. ఆయనతో పాటు మజ్లిస్ ఇతర ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొననున్నారు.