Steel Bridge: స్టీల్ బ్రిడ్జీ అంచనా వ్యయం పెంపు.. రూ.620 కోట్లకు సర్కార్ ఉత్తర్వులు
నల్గొండ క్రాస్ రోడ్స్ నుంచి ఒవైసీ జంక్షన్ వరకు నాలుగు లేన్ల స్టీల్ బ్రిడ్జి అంచనా వ్యయాన్ని సవరిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
దిశ, తెలంగాణ బ్యూరో: నల్గొండ క్రాస్ రోడ్స్ నుంచి ఒవైసీ జంక్షన్ వరకు నాలుగు లేన్ల స్టీల్ బ్రిడ్జి అంచనా వ్యయాన్ని సవరిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండ ఎక్స్ రోడ్డు, సైదాబాద్, ఐఎస్ సదన్ నుంచి ఒవైసీ జంక్షన్ వరకు స్టీల్ బ్రిడ్జీ నిర్మాణానికి రూ.523.37 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే స్టీల్ ధరలు పెరిగిన నేపథ్యంలో అంచనా వ్యయాన్ని రూ.620 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వ్యూహాత్మక ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా ఈ 3.38 కి.మీ నాలుగు లేన్ల స్టీల్ బ్రిడ్జీని రాష్ట్ర ప్రభుత్వ రూ.523.37 కోట్లకు పరిపాలన మంజూరు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో రూ.370 కోట్లతో స్టీల్ బ్రిడ్జీ నిర్మాణం, రూ.153.37 కోట్లతో భూసేకరణ కోసం ఖర్చుచేస్తున్నారు. దీనికి పనులు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇది నల్గొండ క్రాస్ రోడ్స్ నుంచి ఒవైసీ జంక్షన్ వరకు, నల్గొండ క్రాస్ రోడ్స్ నుంచి చంపాపేట్ జంక్షన్ వరకు ప్రయాణించడానికి పట్టే సమయాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది చంచల్‌గూడ జంక్షన్, సైదాబాద్ జంక్షన్, ధోబీఘాట్ జంక్షన్, ఐఎస్ సదన్ జంక్షన్‌ల వెంట ఏర్పడే ట్రాఫిక్ సమస్యలను కూడా తగ్గించనున్నది.
ఆ ఇద్దరికీ ప్రమోషన్..
డీటీసీపీలో డిప్యూటీ డైరెక్టర్లుగా పనిచేస్తున్న కే.శ్రీనివాస్, వై.సుభాష్‌లకు జాయింట్ డైరెక్టర్‌గా ప్రమోషన్ కల్పిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. వీరికి జీహెచ్ఎంసీలో పోస్టింగ్ ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ అధికారులు జీహెచ్ఎంసీ సిటీ ప్లానర్(సీపీ)గా విధులు నిర్వహించనున్నారు.