త్వరలోనే ఏపీ వ్యక్తిని బయటపెడతాం: సుఖేష్ లాయర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రూ.75 కోట్లు ఇచ్చానంటూ సుఖేశ్ చంద్రశేఖర్ రాసిన లేఖ సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రూ.75 కోట్లు ఇచ్చానంటూ సుఖేష్ చంద్రశేఖర్ రాసిన లేఖ సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఓ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న చంద్రశేఖర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఆదేశాల ప్రకారం తెలంగాణ సీఎంకు రూ. 75 కోట్లు ఇచ్చానంటూ శుక్రవారం ఓ లేఖ విడుదల చేయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. బీఆర్ఎస్ కార్యాలయం ముందు ఏపీ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చానని సుఖేష్ ఆ లేఖలో పేర్కొన్నాడు. దీంతో అందరిలో ఏపీ ఎవరు అనే ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉండగా శనివారం సుకేశ్ చంద్రశేఖర్ లాయర్ అనంత మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో వారం రోజుల్లో సంచలన విషయాలు బయటకు వస్తాయన్నారు. అంతేకాకుండా ఏపీ వ్యక్తి ఎవరో కూడా త్వరలోనే బయటపెడతామని అన్నారు. సుకేశ్ చంద్రశేఖర్‌కు ఆప్ రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని తెలిపారు. కానీ, సుఖేష్ జైలుకెళ్లిన తర్వాత కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాగా, సుఖేష్ చంద్రశేఖర్ రాసిన లేఖ ఢిల్లీతో పాటు తెలంగాణ రాజకీయాల్లో సైతం హాట్ టాపిక్‌గా మారింది.