ఉదయ్ స్కీంపై సర్కార్ నిర్లక్ష్యం.. డిస్కంలకు రూ.7091 కోట్లు పెండింగ్

దిశ, తెలంగాణ బ్యూరో: నష్టాల్లో ఉన్న డిస్కంలను ఆదుకునేందుకు

Update: 2022-03-19 02:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నష్టాల్లో ఉన్న డిస్కంలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉజ్వల్​డిస్కమ్​అష్యూరెన్స్​యోజన(ఉదయ్) స్కీం నీరుగారుతోంది. కేంద్రం డిస్కంల నష్టాలను పూడ్చేందుకు తెలంగాణ ప్రభుత్వానికి రుణంగా నిధులు కేటాయించినా వాటిని విద్యుత్​సంస్థలకు అందించకుండా తాత్సారం వహిస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నిధులు కేటాయించలేదని కాగ్​నివేదిక స్పష్టం చేస్తోంది. 2018-19 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం రూ.7,091.65 కోట్లు పెండింగ్​పెట్టినట్లుగా కాగ్​వెల్లడించింది. డిస్కంలను నష్టాల నుంచి లాభాల బాట పట్టించేందుకు తీసుకొచ్చిన ఉదయ్ పథకం ఆశించిన రీతిలో నెరవేరలేదని విమర్శలు వస్తున్నాయి.

విద్యుత్​పంపిణీ సంస్థలను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015 లో ఉదయ్​పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రథకాలకు నిధులు కేటాయించేందుకు కేంద్రం పలు గైడ్​లైన్స్ ను రూపొందించింది. అయితే 2015 సెప్టెంబర్​నాటికి తెలంగాణ డిస్కంలు రూ.11,897 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. అయితే ఇందులో 75 శాతం నష్టాలను అంటే రూ.8,923 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాల్సి ఉంది. ఇందుకు గాను ఉదయ్​స్కీం బాండ్ల ద్వారా కేంద్రం నుంచి రూ.8,931.51 కోట్లు రుణంగా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాల్సిన మొత్తం కన్నా మరిన్ని అదనపు నిధులు తీసుకున్నా తెలంగాణ సర్కార్​డిస్కంలకు పూర్తి మొత్తంలో చెల్లించలేదు. రూ.8,923 కోట్లకు గాను రూ.7,723 కోట్లు మాత్రమే విద్యుత్​పంపిణీ సంస్థలకు చెల్లించింది. మిగిలిన రూ.1200 కోట్లను కేటాయించకుండా జాప్యం చేస్తోంది. ఇదిలా ఉండగా 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి అసలు ఏమాత్రం నిధులు అందించకపోవడంపై విమర్శల పాలవుతోంది.

తెలంగాణ ప్రభుత్వం 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను డిస్కంల నష్టాల్లో 5 శాతాన్ని 2017-18 లో చెల్లించాల్సి ఉంది. 2017-18 కి చెందిన నష్టాల్లో 5 శాతాన్ని 2018-19 లో, 2018-19 కి చెందిన నష్టాల్లో 25 శాతాన్ని 2019-20లో, 2019-20 కి చెందిన నష్టాల్లో 50 శాతాన్ని 2020-21లో చెల్లిస్తానని త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి డిస్కంలకు చెల్లించాల్సిన నిధులను కేటాయించకుండా తెలంగాణ సర్కార్​తాత్సారం వహిస్తోంది. అప్పటి నుంచి 2020‌‌-21 ఆర్థిక సంవత్సరానికి గాను చెల్లించాల్సిన రూ.7,091.65 కోట్లను నేటికీ చెల్లించలేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం టారిఫ్‌ల ఆధారంగా 9,128.57 కోట్ల లోటులో విద్యుత్​సంస్థలు ఉన్నాయి. దీనిని పూడ్చుకునేందుకు 2022-23 వార్షిక సంవత్సారానికి రూ.6831 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదనలు చేశాయి. ఒకవేళ చార్జీలు పెంచితే రూ.5,044.27 కోట్ల ఆదాయం డిస్కంలకు సమకూరుతుంది. అంటే ఇప్పుడున్న లోటు రూ.9,128.57 కోట్ల నుంచి రూ.4,084.3 కోట్లకు తగ్గనుంది. అయినా విద్యుత్ సంస్థలు అప్పుల ఊబిలోనే కొట్టుమిట్టాడనున్నాయి.

Tags:    

Similar News