ట్రిపుల్ ఆర్ నార్త్ అలైన్‌మెంట్ మార్చాల్సిందే.. లేదంటే ఉద్యమం చేపడుతాం: ఎంపీ లక్ష్మణ్
రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) నార్త్ అలైన్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా మార్చాలని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) నార్త్ అలైన్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా మార్చాలని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం టెండర్లు పిలవడం శుభపరిణామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ నార్త్ అలైన్మెంట్ మార్పు చేయాలని, లేదంటే బాధితుల పక్షాన ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ అలైన్‌మెంట్ మార్చాలని డిమాండ్ చేసిందని గుర్తుచేశారు. భువనగిరిలో ప్రియాంక గాంధీ వచ్చి ఆర్ఆర్ఆర్ బాధితులకు హామీ ఇచ్చారని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నేతలు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. నాడు బాధితుల పక్షాన ఉన్నవాళ్లు ఇప్పుడు మంత్రులు, ఎంపీలు అయినా అలైన్‌మెంట్ మార్పుపై స్పందించడంలేదన్నారు.
సీఎం రేవంత్ ఆయన నియోజకవర్గం వైపు మాత్రం అలైన్మెంట్ మార్చుకున్నారని లక్ష్మణ్ విమర్శలు చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై లక్ష్మణ్ స్పందించారు. దేశంలో ఏటా ఎక్కడో ఒకచోట ఎన్నికలతో అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని, అందుకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును తీసుకొచ్చినట్లటు చెప్పారు. ఈనెల 8న ఢిల్లీలో దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ తొలి సమావేశం జరగనుందన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై జేపీసీ నివేదిక అందుతుందన్నారు. కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలా దిగజారిపోయిందని విమర్శలు చేశారు. మూడు రాష్ట్రాలకే పరిమితమైన కాంగ్రెస్ జమిలి ఎన్నికలను ఎందుకు వద్దనుకుంటోందని ఆయన చురకలంటించారు. అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటామని లక్ష్మణ్ తెలిపారు. అన్ని పార్టీల ఎంపీలు సైతం జమిలి కావాలని మనసులో కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.