పక్షుల గానం ప్రకృతికి మేలిమి రాగం..!
"పక్షులు మానవునికి జీవన గమనం నేర్పుతాయి. వాటిని కాపాడటం మన కర్తవ్యం". అని భారతదేశ పక్షి శాస్త్ర పితామహుడు సలీం అలీ
"పక్షులు మానవునికి జీవన గమనం నేర్పుతాయి. వాటిని కాపాడటం మన కర్తవ్యం". అని భారతదేశ పక్షి శాస్త్ర పితామహుడు సలీం అలీ అన్న మాటలు జాతీయ పక్షుల దినోత్సవం సందర్భంగా నెమరు వేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. పక్షులను రక్షించడం కేవలం ప్రకృతికి మేలు చేయడం మాత్రమే కాదు, మన భవిష్యత్తు తరాలకు ప్రకృతి సంపదను అందించడం. ప్రతి వ్యక్తి పక్షుల రక్షణలో తమ పాత్ర గుర్తించి, వాటి జీవనాన్ని కాపాడే చర్యలు తీసుకోవాలి.
మానవ జీవితంలో పక్షుల ప్రాముఖ్యత
పక్షులు ప్రకృతికి అందాన్ని, పక్షుల గానం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. పక్షుల జీవన విధానం మానవునికి సహనాన్ని, శ్రమను, స్వేచ్ఛను నేర్పుతాయి. వీటి కదలికలు, జీవన శైలులు పర్యావరణ పరిస్థితులపై మానవునికి స్పష్టమైన సంకేతాలు ఇస్తాయి. పక్షులు వ్యవసాయంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. పంటలకు హానిచేసే పురుగులను తిని పంటలను రక్షిస్తాయి. పక్షులు పుష్పించే పూల నుండి మకరందాన్ని పీల్చే క్రమంలో పరాగ సంపర్కానికి సహకరిస్తాయి. ఈ ప్రక్రియ పంటల ఉత్పాదకతకు పెంచుతుంది. అందుకని పక్షులను వ్యవసాయానికి సహజ మిత్రులు అని అంటాము. చనిపోయిన చిన్న జీవుల అవశేషాలను తినడం ద్వారా పక్షులు (గద్దలు, రాబందులు) వ్యాపించే రోగాలను తగ్గి స్తాయి. ఇవి పర్యావరణానికి అందాన్ని జోడించి పర్యాటకులను ఆకర్షించి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతాయి. ఇంతగా మనిషికి, ప్రకృతికి, వ్యవసాయానికి విడదీయరాని అనుబం ధం ఉన్న పక్షులు నేడు అడవులు అంతరించి పోతున్నాయి.
రేడియో తరంగాల వలన..
కమ్యూనికేషన్ రంగాలలో సాంకేతిక విప్లవం ఎంతో సంతోషకరమైన విషయం అయినప్పటికీ, పక్షుల మనుగడకు నష్టం వాటిల్లుతుందని పక్షి, ప్రకృతి ప్రేమికులను కలవరపెడుతోంది. సెల్ఫోన్ సిగ్నల్ టవర్ల ద్వారా వచ్చే రేడియో తరంగాలు చిన్న జీవులైన పక్షులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. రేడియేషన్ కారణంగా పక్షులు వాటి దారులను గుర్తించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వీటి కార ణంగా పక్షులు ఆవాస స్థలాలు మారిపోతున్నాయి. పైగా పక్షుల జ్ఞానేంద్రియాలు(సెన్స్ ఆర్గాన్స్) దెబ్బతిని ఆహారాన్ని గుర్తించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ మధ్యకాలంలో జరిగిన అన్ని శాస్త్రీయ పరిశోధనలు.. టవర్ల చుట్టూ ప్రక్కల ఉన్న పక్షుల జనాభా తగ్గుముఖం పట్టిందని ఉద్ఘాటిస్తున్నాయి. అంతర్జాతీయంగా, భారతదేశం లో పక్షులను రక్షించడానికి.. వాటి నివాస స్థలాలను కాపాడటానికి వివిధ చట్టాలు అమలు లో ఉన్నాయి కానీ ఆచరణలోనే అవి సాధ్యం కావడం లేదు.
పక్షుల సంరక్షణా మార్గాలు..
పక్షుల సంరక్షణ అనేది పర్యావరణ సంరక్షణకు కీలకం. పక్షులను రక్షించడం ప్రతి మనిషి బాధ్యత. పక్షులు కనుమరుగు అవుతున్న పరిస్థితుల్లో వాటి జీవన ప్రదేశాలను కాపాడటం, ఆహార భద్రత కల్పించడం, పచ్చదనం పెంచడం, కృత్రిమ రసాయనాల వాడకాన్ని తగ్గించడం, పక్షుల సంరక్షణ గురించి ప్రజలలో అవగాహన పెంచడం, విద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, పక్షుల రక్షణ చట్టాలను గౌరవించడం, పర్యవేక్షించడం, రేడియో తరంగాల పరిమితిని నియంత్రించడం ద్వారా పక్షుల జనాభా సంఖ్యను వృద్ధి చేయవచ్చు. జాతీయ పక్షుల దినోత్సవం, పక్షుల ప్రాముఖ్యతను గుర్తు చేసుకునే ఒక మంచి సందర్భం. పక్షులను రక్షించడం కేవలం ప్రకృతికి మేలు చేయడం మాత్రమే కాదు. మన భవిష్యత్తు తరాలకు ప్రకృతి సంపదను అందించడం. ప్రతి వ్యక్తి పక్షుల రక్షణలో తమ పాత్ర గుర్తించి, వాటి జీవనాన్ని కాపాడే చర్యలు తీసుకోవాలి. పక్షుల సంరక్షణే భవిష్యత్తుకు భరోసా." పక్షులను కాపాడడం అంటే ప్రకృతిని కాపాడటం. ప్రకృతి లేని జీవితం అసంభవం". అని ఎల్డో లియో ఫోల్డ్ అన్న మాటలు మనం ఎప్పుడూ గమనంలో ఉంచుకుని పక్షుల సంరక్షణకు పాటుపడాలి.
(జాతీయ పక్షుల దినోత్సవం)
- కమల హాసన్ తుమ్మ
95056 18252