సర్కారు నుంచి దేవాలయాలకు విముక్తి కల్పించాలి!

కదులుదాం..! ఊరు.. వాడ కలిసికట్టుగా తరలుదాం..!! ప్రభుత్వ ఆధీనంలో నుంచి దేవాలయాలను విముక్తి చేసేందుకు "హైందవ శంఖారావం" పూరిద్దాం.

Update: 2025-01-04 00:45 GMT

కదులుదాం..! ఊరు.. వాడ కలిసికట్టుగా తరలుదాం..!! ప్రభుత్వ ఆధీనంలో నుంచి దేవాలయాలను విముక్తి చేసేందుకు "హైందవ శంఖారావం" పూరిద్దాం - హిందూ శక్తిని ప్రదర్శిద్దాం..! అవును.. ఇన్నాళ్లకి ఆ ఆలోచనకు ఉద్యమ రూపం దాల్చింది. అదే.. మసీదులు, చర్చిలు వాళ్ల సొంత ఆధీనంలో ఉండగా.. దేవాలయాలు మాత్రం ప్రభుత్వాధిరంలో ఎందుకు ఉండాలి..? ఈ ప్రశ్నకు జవాబు కోసం విశ్వహిందూ పరిషత్ ఆందోళన బాట పట్టింది. మసీదులు, చర్చిల మాదిరే మా దేవాలయాలు మాకు ఇవ్వాలని వీహెచ్‌పీ ఉద్యమిస్తోంది. సెక్యులరిజం అన్నప్పుడు అన్ని మతాలకు సమాన దూరం పాటించాలి.. కానీ హిందుత్వాన్ని అంటరానిదిగా చేసి,మిగతా వారిని గుండెలకు హత్తుకోవడం ఏంటి..? ఎందుకు ఇంతటి వివక్ష..? అని గర్జించేందుకు వీహెచ్‌పీ సిద్ధమైంది. 

"ప్రభుత్వాలు దిగి వచ్చేలా చేసి, మన ఆలయాల ఆలనా పాలన మనమే చేసుకుందాం. ఎండోమెంట్ పేరుతో అధికారులు, పాలకులు దేవాలయాలపై పూర్తిగా పెత్తనం చెలాయిస్తున్నారు. రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా, రాజకీయ నిరాశ్రయులకు ఆశ్రమం కల్పించేలా పాలకుల వ్యవహారాన్ని ఇక సాగనివ్వం." అంటూ ప్రతి ఒక్కరూ పిడికిలి బిగిద్దాం. దేవాదాయం అంటే ఆ దేవుడిదే. ఆ దేవుడిని ఆరాధించే భక్తులదే. కానీ, దేవుడిపై విశ్వాసాలు లేని రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించేలా చేపడుతున్న చర్యలకు నిలదీద్దాం. కాలనీ స్థాయిలోని మందిరం నుంచి మొదలుకొని కలి యుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానం వరకు బోర్డులు, కమిటీలు ఏర్పాటు చేసి భగవంతుని బందీ చేస్తున్న వ్యక్తులకు అవగాహన కల్పిద్దామంటూ హిందువులను తట్టి లేపుతోంది. భక్తి లేకపోవడం అటు ఉంచితే, అసలు అన్యమతస్తులకు, మాజీ నక్సలైట్లకు సైతం భగవంతుడి బోర్డుకు చైర్మన్లుగా చేసి పెద్ద అపచారం చేస్తున్న పాలకులకు కనువిప్పు చేసేందుకు చర్యలు చేపట్టింది. అర్చక పురోహితులపై ఆధిపత్యం చెలాయిస్తూ.. దేవుడి సొమ్ముతో జల్సాలు చేస్తూ.. ప్రోటోకాల్ అంటూ దేవుడి దగ్గర హంగామాలు చేసే నీచ రాజకీయాల నుంచి దేవాలయాలను విముక్తి చేద్దాం.

మతాల మధ్య ఈ వివక్ష దేనికి?

దేవాలయాల భూములన్నీ ఎండోమెంట్ పేరుతో ప్రభుత్వం తన కబంధహస్తాల్లో ఉంచుకొని పలు రకాలుగా వాడేసుకుంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు, పేదలకు పక్కా ఇల్లు నిర్మిస్తోంది. వివిధ పరిశ్రమలకు స్థలాలు కేటాయిస్తోంది. కానీ, వక్ఫ్ భూములు, మిగతా చర్చిల ఆస్తుల విషయంలో నోరు మెదపడం లేదు. పైగా, కావలసినన్ని ప్రభుత్వ భూములను వక్ఫ్, చర్చిలకు దాన ధర్మం చేస్తుంది. ఇది సరిపోవు అన్నట్టు ప్రభుత్వ ఖజానా నుంచే ఇమామ్‌లకు, పాస్టర్లకు జీతాలు కూడా చెల్లిస్తోంది. కానీ అదే సందర్భంలో దీప ధూప నైవేద్యం, అర్చక పురోహితులకు ఇస్తున్న ఖర్చుల విషయంలో అనేక అవరోధాలను సృష్టిస్తూ హిందువులను తీవ్రంగా హింసిస్తోంది. ఆదాయం (హుండీ) వచ్చే ఆలయాలపై ఎండోమెంట్ అధికారులు గద్దల్లా వచ్చి వాలిపోయి ఆస్తులన్నీ హరించి వేస్తున్నారు. కానీ, దేవాలయాల అభివృద్ధి మాత్రం గాలికి వదిలేస్తున్నారు. వద్దన్నా ఇఫ్తార్ విందులు, క్రిస్మస్ తోఫా, రంజాన్ తోఫా ఇస్తూ ముస్లింలు, క్రైస్తవులను నెత్తిన ఎక్కించుకొని సకల మర్యాదలు చేస్తున్నారు.

భక్తుల నడ్డి విరగ్గొడుతున్న టికెట్లు..

హిందువుల పండుగలకు మాత్రం అధిక రేట్లు పెంచి వ్యాపారం చేస్తున్నారు. టికెట్ల రూపంలో భక్తుడిని చుట్టుముట్టి రక్తాన్ని పీల్చేస్తున్నారు. చివరకు మన గ్రామాల్లో గ్రామ దేవతకు కొబ్బరికాయ కొట్టాలన్న కూడా పన్ను చెల్లించాలి. దేవుని దర్శించుకోవాలంటే గ్రేడ్ల వారిగా నిర్ణయించి, ఒక్కో గ్రేడుకు ఒక్కో రేటు టికెట్ ధర వసూలు చేస్తూ భక్తుల జేబులు ఖాళీ చేస్తున్నారు. ఇక వేలాది రూపా యలు విలువ చేసే ప్రసాదాలు, శాలువాలు అందించి రాజకీయ నేతల మన్ననలు పొందుతున్నారు. అదే దేవాలయాలకు సాధారణ భక్తులు వస్తే రకరకాలుగా టికెట్లు నిర్ణయిస్తూ.. ప్రసాదాల పేరుతో దండుకొని భక్తుల నడ్డి విరగొడుతున్నారు. వచ్చిన ఆదాయమంతా తమ ఖాతాలో వేసుకుని ఇతర మతస్తులకు పప్పు బెల్లాల మాదిరి పంచిపెడుతోంది ప్రభుత్వం.

ఆలయాలను దోచుకున్నది ఇక చాలు..

కాబట్టి ఇంతటి ఘోరమైన వివక్ష నుంచి హిందూ దేవాలయాలను విముక్తి చేసుకుందాం. హైందవ స్వాభిమానం సంరక్షించుకుందాం. హిందువులంతా సంఘటితమై జనవరి ఐదున విజయవాడలో నిర్వ హించే హైందవ శంఖారావం సభకు లక్షలాదిగా తరలుదాం. ప్రభుత్వ కబంధహస్తాల నుంచి దేవాలయాలను విముక్తి చేసుకుందాం. హైందవ శక్తి ప్రదర్శన చేసి హిందుత్వాన్ని నిలబెడదాం. రాజకీయాలు, కులాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి హిందువు స్వచ్ఛందంగా కదిలి వచ్చి హైందవ శక్తి ప్రదర్శించేందుకు అందరినీ సాదరంగా ఆహ్వానిస్తోంది వీహెచ్‌పీ.

(జనవరి 5న విజయవాడలో వీహెచ్‌పీ శంఖారావం)

- పగుడాకుల బాలస్వామి

ప్రచార ప్రసార ప్రముక్, వీహెచ్‌పీ

99129 75753

Tags:    

Similar News