పోలీసులకు ఆదేశాలే కాదు.... ఆత్మ విశ్వాసం నింపండి!

తెలంగాణ పోలీస్ శాఖలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. కానిస్టేబుల్, ఎస్సై స్థాయి ఉద్యోగులు బలవన్మరణాలకు

Update: 2025-01-05 01:15 GMT

తెలంగాణ పోలీస్ శాఖలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. కానిస్టేబుల్, ఎస్సై స్థాయి ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కొన్ని ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సంబంధాలు. వివాహేతర సంబంధాలు, కుటుంబ సమస్యలూ, పని ఒత్తిడి, పని ప్రదేశాల్లో చిన్నపాటి వేధింపులు వంటివి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని ఇటీవల ఘటనలతో నిర్ధారణ అవుతోంది. కారణాలు ఏమైనా కింది స్థాయి ఉద్యోగులు బలైపోతున్నారు. నెల రోజుల్లోనే వరుస ఘటనలు జరుగుతుండటంతో పోలీస్ శాఖ ఉలిక్కి పడింది. ఒక్క డిసెంబర్ నెలలోనే ఐదుగురు సూసైడ్ చేసుకోవడం, మృతుల్లో ఇద్దరు ఎస్ఐలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 

ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పటికీ, సాంప్రదాయకంగా ఉద్యోగ భద్రత, స్థిరపడిన జీవితంతో ముడిపడి ఉన్న ఆర్థిక భద్రత లేకపోవడం గురించి ఆందోళన చెందుతున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న నేపథ్యంలో కొందరు పోలీసులు ఆత్మహత్యల పాలవడం విషాదకరం. వివిధ కారణాలతో పోలీసు శాఖలో ఆత్మహత్యలు పెరగడం గమనార్హం.

కుటుంబంతో గడిపే టైం లేదు!

ఇటీవలి పోలీసుల ఆత్మహత్యలలో కనిపించే నమూనా ఏమిటంటే, బాధితులు చాలా తక్కువ ర్యాంక్ పోలీసు ఉద్యోగస్తులు. వారు పెరుగుతున్న అననుకూల పరిస్థితుల్లో పని చేస్తున్నారు. వారానికి 7 రోజులు రొటేషనల్‌ షిఫ్ట్‌ల ప్రకారం వీక్‌ఆఫ్‌ లేకుండా పని చేయాల్సి ఉంటుందని అంటున్నారు. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా యవ్వనంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య అన్యోన్య సంబంధాలు కరువవుతున్నాయి. అందుకే ఇతరులతో వ్యామోహాలకు గురవుతున్నారు. అలాగే పిల్లలను పట్టించుకునే సమయం కూడా దొరకడం లేదు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్న పాత పోలీసు మాన్యువల్‌పై పని చేస్తున్నారు, ఇది తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా దీనిని ఆధునీకరించలేక పొయారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవ చేసేందుకు పని చేసే వీరికి డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)తో సహా బహుళ భత్యాలను సకాలంలో చెల్లించడంలేదని పేరు చెప్పడానికి ఇష్టపడని డీఎస్పీ స్థాయి అధికారి నాతో ఆవేదన వ్యక్తం చేశారు.

33 శాతం మానసిక బాధితులు..

ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్లో ప్రచురించబడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లోని 150 మంది పోలీసు సిబ్బందిలో ఒత్తిడిపై 2013లో జరిపిన ఒక అధ్యయనంలో వారిలో మూడో వంతు మంది మానసిక వేదనతో బాధపడుతున్నారని కనుగొన్నారు. ‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్’ 2020లో 21 రాష్ట్రాలలో నిర్వహించిన ఒక సర్వేలో పని భారం, పని-జీవితంలో సమతుల్యత సరిగ్గా లేకపోవడం, వనరుల కొరత కారణంగా పోలీసు సిబ్బంది ఒత్తిడికి లోనవుతున్నారు. 25% వారు రోజుకు 16 గంటల కంటే ఎక్కువ పని చేస్తున్నారని చెప్పారు. దాదాపు 50% మంది వీక్లీ ఆఫ్ పొందలేదని చెప్పారు. 30% కంటే ఎక్కువ మంది తమ వృత్తిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పోలీసు అధికారుల ఒత్తిడిని, ప్రవర్తనలోని మార్పులను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. మానవ అసభ్యత, బాధలను ప్రతిరోజూ బహిర్గతం చేయడం వల్ల పోలీసులు ప్రభావితమవుతారు. కాలక్రమేణా ప్రతికూలమైన ప్రజలతో వ్యవహరించడం భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. ఈ ఒత్తిడికి చికిత్స చేయకుండా వదిలేస్తే, అధిక రక్తపోటు, అల్సర్లు, జీర్ణ రుగ్మతలు, తలనొప్పి, గుండె జబ్బులు కూడా వస్తాయి.

అధికారుల వేధింపులు..

అక్టోబర్ 13న బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్‌‌లోని పోలీసు కానిస్టేబుల్ గంజాయి కేసులో సస్పెన్షన్‌కు గురైన భూక్య సాగర్ తన భార్యను ఉద్దేశించి వీడియోలో తన డెత్ నోట్‌ను బంధించి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వీడియోలో తన సస్పెన్షన్‌కు తన సీనియర్ అధికారులే కారణమని ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌ నుండి స్వాధీనం చేసుకున్న నిషిద్ధ వస్తువులను పోగొట్టినందుకు స్టేషన్‌లోని ఇద్దరు ఎస్‌ఐలను బాధ్యులను చేసారు, దాని కోసం అతన్ని బలిపశువుగా చేసి సర్వీస్ నుండి సస్పెండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మెదక్ జిల్లా చిల్పిచెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబరు 9న మహిళా అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ తన కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తన సీనియర్ అధికారి, పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ యాదగిరి తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆరోపిస్తూ సూసైడ్ నోట్ రాసింది.

కాస్త చేయూతనిస్తే..

ఇటీవలి కాలంలో పెరుగుతున్న పోలీసు సిబ్బంది ఆత్మహత్యల నేపథ్యంలో, వారి సమస్యలను పరిష్కరించడానికి, అవసరమైన సహాయం అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ తీవ్రమైన కసరత్తు చేస్తోంది. గత బీఆ‌ర్ఎస్ ప్రభుత్వంలో లాగా కాకుండా పోలీసు ట్రాన్సఫర్‌‌లలో రాజకీయ నాయకుల జోక్యాన్ని తగ్గించగలిగారు. ప్రజలకు ధైర్యం ఇచ్చే పోలీసులు... సమస్యలను ఎదుర్కొనే ధైర్యం కోల్పోవడం వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పని ఒత్తిడి, ఆఫీసర్లు, సిబ్బంది మధ్య కో-ఆర్డినేషన్, ఆర్థిక ఇబ్బందుల పర్యవేక్షణపై, పర్సనాలిటీ డెవలప్మెంట్‌పై పలు మోటివేషనల్ ప్రోగ్రా మ్స్, ఒత్తిడి తగ్గించేందుకు శాఖాపరమైన అవగాహన కార్యక్రమాలు తరచుగా ఏర్పాటు చేయాలి. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని, సమస్యలుంటే పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నిపుణుల సూచన. సమస్యలున్నప్పుడు మానసిక ధైర్యా న్ని అందిస్తే చాలావరకు ఆత్మహత్యలను నివారించవచ్చు.

-డాక్టర్ బి. కేశవులు ఎండి. సైకియాట్రీ,

చైర్మన్, తెలంగాణ ఆత్మహత్యల నిరోధక కమిటీ,

85010 61659

Tags:    

Similar News