శాసనకర్తలే ఉల్లం'ఘనులు'..

ప్రతిష్టాత్మకమైన శాంతి భద్రతల విభాగం పోస్టింగులకు సంబంధిత శాసన సభ్యులు/మంత్రుల రికమెండేషన్‌

Update: 2025-01-04 01:15 GMT

ప్రతిష్టాత్మకమైన శాంతి భద్రతల విభాగం పోస్టింగులకు సంబంధిత శాసన సభ్యులు/మంత్రుల రికమెండేషన్‌ తెచ్చుకోవలసిన అప్రకటిత ఆచారం పదేళ్ల నాడే వాడుకలోనికి వచ్చింది. ఆ వ్యవహార నిర్వహణ క్రమంలో పరస్పర స్వప్రయోజనాల పాత్ర ఎంతో కీలకంగా మారింది. నిజాయితీకి అలవాటు పడిపోవడం మూలంగా పోటీని తట్టుకోలేని పోలీసు అధికారులు నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. శాంతి భద్రతల విషయంలో పాలకులు అనుసరిస్తున్న సంధి ప్రస్తావన ధోరణుల వలన పోలీసుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు మనుగడ కరువై సమర్థత ప్రదర్శన వెనక్కు నెట్టివేయబడింది. ఫలితంగా నేరాలకు, అంతర్గత భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు బీటలు వారుతున్నాయి. ఆ దుశ్చర్యల్లో ఎప్పుడూ సమిధలయ్యేది సామాన్య మానవులే మరి. 

నేటి ప్రజాస్వామ్య పాలనా విధానంలో పోలీసు అధికారులు కార్యనిర్వహణాధికార బాధ్యతలు గలవారుగా చట్టాన్ని అమలు చేయుటకై అహోరాత్రులు శ్రమిస్తూనే ఉన్నారు. వృత్తి ధర్మ నిర్వహణకై అంకితులైన వారుగావున ఎంతటి క్లిష్టమైన పరిస్థితులెదురైననూ వెరవక, స్వీయ లాభాలు పక్కనపెట్టి ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడక అమలులోనున్న చట్టాల ద్వారా నేర నివారణ, నేరపరిశోధన, శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా తమ విధులను నిర్వహిస్తున్న చరిత్ర వారిది. పోలీసు పాలన ఆదర్శనీయతను అలా కొనసాగించడంలో సూచిత వృత్తి ధర్మ నిబద్ధతలను పాటిస్తూ క్షేత్రస్థాయిలో పోలీ సులు, పర్యవేక్షణాధికారుల నిర్వహణ పాత్ర చాలా ప్రశంసనీయంగా ఉంది.

వారి మరక పోలీసులకూ అంటితే...

కాలమాన పాలనా పరిస్థితుల ప్రభావం మూలంగా పోలీసుశాఖ ప్రతిష్ట మసకబారి పోవుచున్నదను విమర్శలను ఎదుర్కొంటున్నది. పోలీసుల్లో సహజ స్థితి నుండి దిగజారిపోయిన విలువలు, వృత్తి పరంగా అచేతనమైన కౌశలాలు, నేల చూపులు చూస్తున్న అంతర్బుద్ధి ప్రధాన కారణాలుగా ప్రస్ఫుటమవుతున్నవి. అన్నింటి మూలాలు పౌర సమా జంలో పడిపోయిన విలువల వల్లనే అని అర్థమవుతుంది. పాలకుల్లో సైతం 'స్వప్రయోజన' కారక ఆలోచనలు, 'నిర్ణయాలు' కొనసాగుట వలన పోలీసులను వేరుగా చూడలేని పరిస్థితి. పర్యవసానంగా అసాంఘిక కార్యకలాపాలు, సంఘ విద్రోహ చర్యలు చట్టం అమలును కమ్మేస్తున్న వాతావరణం నెలకొన్నది. నేరాలు, ఘోరాలతో అట్టుడికిపోతున్న సమాజంలో అభద్రత నెలకొని జనజీవనం అతలాకుతలమై పోవుచున్నది. ఉల్లంఘన చర్యల ఉదంతాల శాతం స్వల్పమే అయినా, అవి ప్రజలు పోలీసులపై ఏర్పరచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయడమే కాకుండా వారి హక్కులను, భద్రతలను పోలీసు నుండి పొందలేమను అభిప్రాయాలకు బీజం వేసినట్లయింది. పోలీసులపై తాము పెంపొందించుకున్న నమ్మకం వల్లనే వంచించబడుచున్నామను అభిప్రాయం వారిలో పొడసూపుతోంది.

అన్నింటికీ స్వప్రయోజనాలే..!

చట్టం అమలుతో ప్రజలకు న్యాయం చేకూర్చి పౌరు లకు గౌరవ మర్యాదలనందించు లక్ష్యంగా పనిచేయు పోలీసుల మనోబలం సన్నగిల్లి స్వీయ ప్రయోజనా కాంక్షవైపు మొగ్గుచూపుతోందనే విమర్శలను వింటూనే ఉన్నాం. ఒకఅడుగు ముందుకువేసిన నేటి పోలీసులు సామాన్య మానవుని సమస్యలను పక్కకు నెట్టి పలుకుబడిగల వ్యక్తులు, పాలకు లు, పదాధికారుల కొమ్ముకాయుటలోనే తమ విధి నిర్వహణకు న్యాయం చేయగలుగుచున్నట్లుగా భావించుట కాదనలేం. దానికి కారణాలను వెదకుటకు అంతగా శ్రమించనవసరంలేదు. పోలీసు సంస్థాగత నిర్వహణలో భాగాలైన నేర నివారణ, పరిశోధన, శాంతి భద్రతల పరిరక్షణ, సామాజిక భద్రత తదితర చర్యలన్నింటిలో స్వీయ ప్రయోజనం, దాని పాత్ర గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తున్నది. దానికి హోదాలతో పని లేకుండా పోయిందనేది నగ్నసత్యం.

ఇంటెలిజెన్స్‌ని నిర్వీర్యం చేసి...

పోలీసు పరిపాలనకు పరిపుష్టి నందిస్తూ గుండె కాయలాగా వ్యవహరించే ఇంటలిజెన్స్‌ విభాగాన్ని పాలకులు తమ రాజకీయ ప్రయోజన సమాచార సేకరణకు ఉపయోగించడానికి సిద్ధమవడం వలన ఇతర విభాగాల విధులకు న్యాయం చేకూర్చడంలో ప్రత్యేక కసరత్తు అనివార్యమైనట్లుగా కనబడుతోంది. అంతర్గత భద్రత విభాగం విధులు రాజకీయ పెద్దలకు, పదాధికారులకు సేవలందించడంతోనే సరిపుచ్చుకోవలసి వస్తున్నది. జన సామాన్యులకు రాష్ట్ర ప్రయోజనాలు అందించగల అంశాలను రెండవ వరుసలో నిలపడం జరుగుచున్నది. పర్యవసానంగా నేరాలు, శాంతిభద్రతల సమస్యలు పెచ్చ రిల్లి పోలీసుశాఖకు సవాలుగా పరిణమించాయి.

జీ హుజూర్ అంటేనే బతకగలం..

పాలకుల సంకుచిత భరితమైన పాలనా విధానాల ప్రభావం పోలీసు శాఖ యొక్క సంస్థాగత నిర్వహణ విధానంలో కొట్టవచ్చినట్లుగా అగుపిస్తున్నది. పోలీ సుల నుండి ప్రభుత్వానికి కావలసింది సంపూర్ణ విధేయత. ఆ విషయం గురించి ఎప్పుడూ, ఎవరికీ చెప్పరు. చెప్పకపోయిననూ గమనించి నడుచుకొని ఎల్లవేళలా పాలకుల పట్ల తమ విధేయతను ప్రదర్శించినంత కాలం పోలీసు అధికారి యోగ్యుడుగానే ఎంచబడతాడు. తేడా రాగానే బదిలీలు సహజ క్రమంగా జరిగిపోతుంటాయి. ఆ పోలీసు అధికారిలో తదనుగుణంగా మార్పు రానంత వరకు అతను బదిలీల చీకట్లలో బందీగా మిగిలిపోవలసిందే. ఆత్మ పరిశీలన, వృత్తి నిబద్ధత, నిజాయితీ తత్వం పాలకులకు అంతగా రుచించని విషయాలు.. అయినా సరే, సమస్త పాలనా యంత్రాంగం పాలకుల కుర్చీ పరిరక్షణకై పాటుపడు బాధ్యతను నెత్తికెత్తుకుని పని‌చేయాల్సి ఉంటుంది.

కుర్చీలో కూర్చోగానే దందాలు..

పోలీసుశాఖ సారథులుగా అపరమేధావులైన అధికారులెంతో మంది ఉన్నా ప్రభుత్వ పరంగా చిత్తశుద్ది లోపంతో ప్రజలు.. చట్టం ఆశించిన మేరకు పోలీసుశాఖ ముందుకు సాగలేకున్నది. వ్యాపారులు రాజకీయల్లోకి చొచ్చుకొని వచ్చి పోటీ తత్వంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి, లంచాలకు పాల్పడి గెలుపు రాజకీయాలకు తెరదీశారు. అలా ''శాసనకర్తలే శాసనోల్లంఘను''లను అపవాదును మూటగట్టుకున్నారు. కానీ అటువంటి అభ్యర్థులకు ''లంచగొండులు'' అను ముద్ర వేయలేకున్నదీ సమాజం. అలాంటి వ్యాపారుల ప్రవేశంతో రాజకీయాలకు, ఎన్నుకోబడిన ప్రభుత్వ కార్యకలాపాలకు దుర్దశ దాపురించింది. పాలక పార్టీ సభ్యులు లంచాలకై ఖర్చు పెట్టిన డబ్బును వివిధ అవినీతి చర్యల ద్వారా రాబట్టు కోవడంతో పాటు అదనపు ఆదాయం క్రింద ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తూ ఇబ్బడి ముబ్బడిగా సంపాదనకెగబడుతున్నారు. పర్యవసానంగా ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు లోటు బడ్జెట్‌ ఉరిమిచూస్తున్నది.

పోలీసు శాఖ బలహీనతకు కారణం

శాసనకర్తలే ''ఉల్లంఘనుల'' అవతారమెత్తడంతో ప్రజాధనం లూటీకి గురియగుచున్నది. వారి బలహీనతల చిక్కుముడులు విప్పుటకు ప్రజలే నడుం బిగించాలి, అభ్యర్థించాలి, నిలదీయాలి, తమ ఓటు బలంతో బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. పాలక విధానాలనలా దారికి తెచ్చుకోలేకున్నచో ప్రగతి కుంటుపడి పోవుట ఖాయం. అసాంఘిక శక్తులు, ఉగ్రవాద శక్తులు, దేశద్రోహ శక్తులు అదనుకై ఎప్పుడూ కాచుకొని ఉంటుంటాయి. ప్రభుత్వ బలహీనతలే వారికి బలం. ఆ బలాన్ని మొగ్గలోనే తుంచి వేయగల సమర్థ పోలీసు వ్యవస్థను సిద్ధపరచుకొని ఉంచడం ప్రభుత్వ బాధ్యత. అందుకవసరమైన వృత్తి నిపుణతను వారిలో పెంపొందింపజేయడం కూడా ప్రభుత్వ బాధ్యతగానే గుర్తించాలి. సమర్థత సహిత విధి నిర్వహణలో స్వేచ్ఛ, ఫలితాలపై జవాబుదారీతనంతో కూడిన గుణాత్మక ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు రానంత వరకు పోలీసు శాఖ నిరీక్షణ స్థాయిలో నిలబడి పోవడం అనివార్యం.

- పెద్దిరెడ్డి తిరుపతిరెడ్డి

94400 11170

Tags:    

Similar News