నాలా పూడ్చి రోడ్డు నిర్మాణం.. అడ్డగోలుగా ఎన్వోసీలు.. కన్‌స్ట్రక్షన్ కంపెనీ గోల్‌మాల్

రియల్ వ్యాపారుల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. అధికార పార్టీ నేతలే కాకుండా.. అధికారులు కూడా అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలూ వస్తున్నాయి.

Update: 2024-09-27 07:39 GMT

దిశ,గండిపేట్: రియల్ వ్యాపారుల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. అధికార పార్టీ నేతలే కాకుండా.. అధికారులు కూడా అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలూ వస్తున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్కటై ప్రభుత్వ, అసైన్డ్, భూధాన్, సిలీంగ్, దేవాదాయ, శిఖం భూములను ఎక్కడిక్కడ క‌బ్జాలు చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. స్థానిక ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీలోనే పలువురు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని, అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగమే జంకుతోందని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇటీవలి కాలంలో గండిపేట్ మండలం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని 262 సర్వే నెంబర్‌లోని బుల్కాపూర్ నాలాను పూర్తి స్థాయిలో పూడ్చేసిన ఓ బిల్డర్.. తాను కొత్తగా నిర్మించిన అపార్ట్‌మెంట్‌కి దారి ఏర్పాటు చేసుకున్నట్లు గత ఏడాది 'దిశ'లో పలు కథనాల ప్రచురించడం జ‌రిగింది. ఏడాది గడిచినా ఆ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ కనీసం కన్నెత్తి చూడలేదు. దీంతో అధికారులు, కన్‌స్ట్రక్షన్ నిర్వాహకులు కుమ్మక్కయ్యారనే అనుమానాలకు తలెత్తుతున్నాయి.

తప్పించుకునే ధోర‌ణే..

జంట జలశయాలు ఉప్పొంగినప్పుడు ప్రవహించే బుల్కాపూర్ నాలాను కాపాడడంలో అటు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ అధికారులు విఫలమయ్యారు. కమీషన్లకు కక్కుర్తి పడి ప్రభుత్వ అధికారులు రియల్ వ్యాపారులకు దాసోహమైనట్లు మణికొండలో ప్రచారం సాగుతుంది. అధికార బలం, ఆర్థిక బలముంటే ప్రభుత్వ నిబంధనలన్నింటిని తుంగలోకి తొక్కే అధికారులుండడం రంగారెడ్డి జిల్లాలో ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇప్పటి వరకు అధికారుల నిర్లక్ష్యంతో ఫిర్యాదులు చేసినా చూసిచూడనట్లు నాలాల కబ్జాను వదిలేశారు. నాలాల కబ్జాతో పెను ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారు. క్షేత్ర స్థాయిలోని అధికారులను నాలాల కబ్జాలపై వివరణ అడిగితే ఉన్నత స్థాయి అధికారుల ఒత్తిడి, అధికార పార్టీల అండదండలు రియల్ వ్యాపారులకు ఉన్నాయంటూ తప్పించుకుంటుండ‌టం విస్తు గొల్పిస్తుంది.

కొర‌వ‌డిన ఆయా శాఖల సమన్వయం:

మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణం జరిగితే రెవెన్యూ, మున్సిపాలిటీల ప్రమేయం ఉంటుంది. ఒక వేళ నిర్మాణం చేసే స్థలాల పక్కన నాలాలు, కాల్వ, చెరువు, కుంటలుంటే ఇరిగేషన్ శాఖ పాత్ర కూడా ఉంటుంది. ఈ విధంగా ఒక శాఖతో పాటు మరొక శాఖకు సంబంధం ఉంటుంది. ఈ శాఖల సమన్వయంతోనే నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు ఇవ్వాలి. కానీ, ఇవేమీ తమకేమి తెలియనట్టుగా శాఖలు ప్రవర్తించడంతో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కబ్జాల పాలవుతున్నాయి. ఒక వేళ నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలకు అనుమతినిస్తే ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద కచ్చితంగా బఫర్ జోన్ స్థలం వదిలేయాలి. ఆ స్థలం వదిలేసిన తర్వాతే నిర్మాణాలు చేపట్టాలి. గండిపేట్ మండలం మణికొండలో కన్స్ట్రక్షన్ నిర్మించే బహుళ అంతస్తుకు దారి నాలాపై నుంచే ఇవ్వడం గమనార్హం. ఇంత పెద్ద భవన నిర్మాణాలు చేపట్టే నిర్మాణ సంస్థ నిబంధనలు పాటించకపోవడం శోచనీయం. అధికారులు తప్పించుకునేందుకు నిర్మించే బహుళ అంతస్తుకు వెళ్లే దారి వద్ద పూడ్చేసిన నాలాను తవ్వకుండా.. ఎక్కడో పక్కన నాలా పూడిక తీసినట్లు ఫొటోలు పెట్టడం దుర్మార్గం. అధికారులు అమృత సంస్థకు ఎంత మద్దతు పలుకుతున్నారో అర్థమవుతోంది. కలెక్టర్ రెవెన్యూ అధికారులకు ఆదేశాలిస్తే తప్పుడు మాటలతో విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అదే రియల్ వ్యాపారిని కాపాడుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు.

అనుమ‌తులెలా ఇచ్చారు..?

హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఏ నిబంధనల ప్రకారం కన్‌స్ట్రక్షన్‌కు అనుమతినిచ్చిందనే ప్రశ్నలు వస్తున్నాయి. మణికొండ మున్సిపాలిటీలో కొన‌సాగుతుంది. జిల్లాలో అనేక ప్రాంతాల్లో హెచ్ఎండీఏ పైరవీలకే ప్రాధాన్యతనిస్తూ భూస్వాథం మార్పిడి. బహుళ అంతస్తులకు అనుమతులిస్తోందనే ఆరోపణలున్నాయి. క్షేత్రస్థాయిలో ఏమీ జరుగుతుందో తెలియకుండానే ఇష్టానుసారం అనుమతులు ఇవ్వడంతో బిల్డర్లు దర్జాగా నిర్మాణాలు చేసుకుంటున్నారు. హెచ్ఎండీఏ ఇచ్చే అనుమతులను అడ్డుపెట్టుకొని రియల్ వ్యాపారులు ప్రణాళికలు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారు.


Similar News