బీసీ సమస్యల పరిష్కారానికి పార్లమెంట్ ముట్టడికి ఆర్.కృష్ణయ్య పిలుపు
బీసీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య(R Krishnaiah) ఈనెల 26న పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చారు.
దిశ, వెబ్ డెస్క్ : బీసీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య(R Krishnaiah) ఈనెల 26న పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చారు. భారతీయ బీసీ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో 13 బీసీ సంఘాలు, 30 ఉపసంఘాల నాయకులతో కలిసి నేడు ఆర్. కృష్ణయ్య సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి, జనగణనలో కులగణన కూడా చేయాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, అందుకు రాజ్యాంగ సవరణలు చేయాలని కోరారు. బీసీలకు సామాజిక న్యాయం చేయకపోతే కేంద్రంపై మిలిటెంట్ పోరుకు దిగుతామని హెచ్చరించారు. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించేలా బిల్లు పాస్ చేయించాలని తెలిపారు. దేశంలో బీసీలను బాగు చేయడమే వికసిత్ భారత్ కు అర్థం అని కృష్ణయ్య పేర్కొన్నారు.