Telangana CM : తొలి సార్వత్రిక ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన యోధుడు: సీఎం రేవంత్ రెడ్డి

వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సంస్కర్త రావి నారాయణ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి ఘనంగా నివాళులు అర్పించారు.

Update: 2024-09-07 05:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సంస్కర్త రావి నారాయణ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక, సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ చైతన్యం కల్పించడంలో రావి నారాయణ రెడ్డి సేవలు మరువలేనివని గుర్తు చేసుకున్నారు. భారత దేశ తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి అత్యధిక ఓట్లతో గెలిచి రాజకీయాల్లో ఒక చరిత్రను సృష్టించారని పేర్కొన్నారు.

కాగా, నల్గొండ జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లిలో రావి నారాయణ రెడ్డి 1908 జూన్ 4న జన్మించారు. హైదరాబాద్‌లోని రెడ్డిహాస్టల్‌లో ఉండి హైస్కూల్, చాదర్ ఘాట్ పాఠశాలలో ఎస్సెస్సెల్సీ, నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్ అభ్యసించారు. విద్యార్థి దశలోనే స్వాతంత్ర్య ఉద్యమంలో జైలుకు వెళ్ళారు. 1930 సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో కాకినాడ వెళ్లి మరీ పాల్గొన్నాడు. 1933లో హైదరాబాద్‌లో ఏర్పాటైన హరిజన్ సేవా సంఘానికి కార్యదర్శిగా పనిచేశారు. 1946-51 కాలంలో తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌పై పోటీచేసి నెహ్రూకన్నా అధిక ఓట్లతో గెలిచి, పార్లమెంటరీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించారు.


Similar News