'కేసీఆర్, కేటీఆర్‌ను ఉరేసినా తప్పులేదు' రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ మార్గాల ద్వారా గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ మార్గాల ద్వారా గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి దోపిడీ దొంగల మాదిరిగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు, ప్రభుత్వం మీద నమ్మకంతో వడ్డీకి డబ్బులు తీసుకువచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తే రెండేళ్లు గడుస్తున్నా వాటికి సంబంధించిన బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు రాక మిత్తి చెల్లించే పరిస్థితి లేక అనేక మంది సర్పంచులు ఆత్మహత్యల బాట పడుతన్నారని, అయినా ప్రభుత్వం స్పందించడం లేదని ఫైర్ అయ్యారు. గ్రామ పంచాయతీ నిధులు, సర్పంచుల సమస్యలపై సోమవారం ధర్నాచౌక్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సర్పంచుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసి వారిని ఆత్మహత్యలకు ఉసిగొల్పుతోందన్నారు. సర్పంచులకు రావాల్సిన 35 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. ఈ డబ్బులన్ని మెఘా కృష్ణారెడ్డి, ప్రతిమ శ్రీనివాస రావు వంటి బడా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించేందుకు, వారిచ్చే కమీషన్ కు ఆశపడి ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఉన్న బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హరితహారం మొక్క చనిపోతే సర్పంచ్ లను సస్పెండ్ చేస్తామన్న ముఖ్యమంత్రి.. కేటీఆర్ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ వరదల్లో 30 మంది కొట్టుకుపోయి చనిపోయారని మరి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ పై చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దితే బీఆర్ఎస్ హాయంలో హైదరాబాద్ ను చెత్తకుప్ప గా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ తో పాటు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ది కాదా అని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని ఇంత అధ్వానంగా తయారు చేసిన తండ్రి కొడుకుల్ని ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఉరి వేసినా తప్పులేదని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు నెల ఫస్ట్‌కు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. తెలంగాణలో పుట్టబోయే బిడ్డపై కూడా లక్ష 50 వేల రూపాయల అప్పును మోపిన కేసీఆర్ ను ఏం చేయాలని అన్నారు. తెలంగాణ మోడల్ అని గొప్పలు చెబుతున్నారని మినిమం గవర్నెన్స్, మాగ్జిమం పాలిటిక్స్ ఇదేనా తెలంగాణ మోడల్ అంటే అని సెటైర్ వేశారు.
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని బీఆర్ఎస్ అంటే భస్మాసుర సమితి అని ఎద్దేవా చేశారు. గతంలో సర్పంచ్ లు, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలకు ఉన్న గౌరవం ఏంటో ఆలోచన చేసుకోవాలన్నారు. ఇవాళ పైరవి కారులుగా, దళారుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్చిందన్నారు. సర్పంచ్ లకు ఆత్మగౌరవం లేకుండా చేశారని మండిపడ్డారు. సర్పంచ్‌లు ఏ పార్టీలో ఉన్నా మీ అందరి కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని, మా పార్టీని వీడి వెళ్లిన సర్పంచ్‌లు అయినా సరే ఆత్మహత్యలకు పాల్పడవద్దని అన్నారు. సర్పంచ్‌ల ఆత్మగౌరవం కాపాడేందుకు కాంగ్రెస్ పని చేస్తుందన్నారు.