Revanth Reddy: పారాలింపిక్స్ పతక విజేతకు నగదు ప్రోత్సాహకం అందజేసిన సీఎం
తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి రూ.కోటి చెక్కును సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి రూ.కోటి చెక్కును సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఇటీవల జరిగిన పారాలింపిక్స్‌లో తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజి కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. పారాలింపిక్స్ లో అద్భుతమైన ప్రతిభ చూపి, పతకం సాధించినందుకు ఆమెతో పాటు కోచ్ కు కూడా ప్రభుత్వం ప్రోత్సాహాకాలు ప్రకటించింది. అథ్లెట్ దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు బహుమతితో పాటు వరంగల్ లో 500 గజాల స్థలం ఇవ్వాలని, అలాగే దీప్తి కోచ్ కు రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకంగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే మంగళవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల చెక్కును దీప్తి జీవాంజికి అందజేశారు. దీనిపై అథ్లెట్ దీప్తి సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి.. భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లాలని దీప్తిని అభినందించారు.