కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన కుమ్ములాటలు.. యాంటీ రేవంత్ వర్గం కీలక సమావేశం

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ పార్టీ అంతర్గత విభేదాలు తీవ్రమవుతున్నాయి. రేవంత్​రెడ్డిని వ్యతిరేకిస్తున్న

Update: 2022-03-20 01:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ పార్టీ అంతర్గత విభేదాలు తీవ్రమవుతున్నాయి. రేవంత్​రెడ్డిని వ్యతిరేకిస్తున్న నేతలు నేడు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. మాజీ ఎంపీ వీహెచ్​ ఆధ్వర్యంలో హోటల్​ ఆశోకాలో ఈ భేటీ జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది నేతలకు ఆహ్వానాలు పంపించారు. కొంతమంది వస్తామని చెప్పగా.. మరికొందరు రామంటూ తేల్చి చెప్పారు. పలువురు మాత్రం చూస్తామంటూ సమాధానం దాట వేశారు. యాంటీ రేవంత్​రెడ్డి ప్రధానంగానే ఈ సమావేశం జరుగుతోంది. ఇప్పటికే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

మీరంతా రండి

టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డిపై అసంతృప్తితో ఉన్న నేతలకు శనివారం సాయంత్రం మాజీ ఎంపీ వీ హనుమంతరావు నుంచి సమాచారం ఇచ్చారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంపై విమర్శలకు దిగుతున్న వారితో పాటుగా కొద్దిరోజులుగా పార్టీకి అంటీముట్టనట్టుగా ఉన్న వారందరికీ ఆహ్వానం పంపారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఇంటికెళ్లి ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్‌ ఆహ్వానించారు. అదేవిధంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ గీతారెడ్డి, మహేశ్​ కుమార్​గౌడ్​, ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ ఇంచార్జ్​ ఏలేటీ మహేశ్వర్​రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్​ మధుయాష్కీ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్​ దామోదర రాజనర్సింహా, మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​తో పాటు పలువురికి ఆహ్వానాలు పంపారు. టీపీసీసీ చీఫ్​ రేవంత్‌రెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జీ మాణిక్కం ఠాకూర్ వైఖరిపై కాంగ్రెస్‌ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని, దానిలో భాగంగా అంతా కలిసి మాట్లాడుకుందామని ఈ సందర్భంగా వెల్లడించారు.

కొందరు రెడీ

వీహెచ్​ నుంచి ఆహ్వానం అందుకున్న పలువురు నేతలు ఈ సమావేశానికి వచ్చేందుకు సిద్ధమని చెప్పినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఎమ్మెల్యేలు రాజగోపాల్​రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్​బాబు, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డితో పాటుగా గీతారెడ్డి కూడా సమావేశానికి వస్తామని హామీ ఇచ్చారు. అయితే, సీఎల్పీ నేత భట్టి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఏలేటీ మహేశ్వర్​రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ వంటి నేతలు రామంటూ చెప్పగా, దామోదర రాజనర్సింహా నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కాగా, కొంతమంది తాము పరిస్థితులపై చర్చించేందుకు వెళ్తున్నామంటూ మీడియాకు చెప్పుతున్నారు.

అసెంబ్లీలో నాకు మద్దతివ్వరా

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇంటికి వెళ్లిన మాజీ ఎంపీ వీహెచ్​.. సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్‌ పార్టీలో తగిన గౌరవం దక్కడం లేదని, అవమానం జరిగే చోట ఉండలేనని కోమటిరెడ్డి, వీహెచ్‌ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అసెంబ్లీ ఘటనను రాజగోపాల్​రెడ్డి ఉటంకించారు. మంత్రి తలసానితో జరిగిన వ్యక్తిగత వ్యాఖ్యలు.. మాటల యుద్ధానికి దారితీసిన నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తనకు అండగా నిలబడలేదని కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గౌరవం లేని చోట ఉండలేనని, తగిన వేదిక ద్వారా కేసీఆర్‌పై పోరాడుతానంటూ వ్యాఖ్యానించారు. దీంతో పాత కాంగ్రెస్‌ నేతలంతా బయటకు వెళ్తే పార్టీ దెబ్బ తింటుందని వీహెచ్‌ సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం. సోనియా, రాహుల్‌ గాంధీ అపాయింట్‌మెంట్‌ కోరి వాళ్లతో ఈ అంశంపై చర్చిస్తానని వీహెచ్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఎల్లుండి ఢిల్లీకి వీహెచ్​

అసంతృప్తి నేతలతో ఆదివారం సమావేశం తర్వాత వీహెచ్​ ఈ నెల 22న ఢిల్లీకి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆదివారం జరిగే భేటీలో అసంతృప్త సీనియర్లంతా హాజరై కీలక నిర్ణయం తీసుకుందామని, దీనిపై ఏఐసీసీకి వివరించేందుకు సోనియా, రాహుల్​ గాంధీ అపాయింట్​మెంట్​ తీసుకునేందుకు ఢిల్లీకి వెళ్తున్నట్లు వీహెచ్​... నేతలకు వివరించారు. అయితే, ఏఐసీసీ పెద్దల నుంచి వీహెచ్​కు అపాయింట్​మెంట్​ వస్తుందా.. లేదా అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News