ఆ కారణంతోనే నేను ఆత్మహత్య చేసుకుంటా.. ఓ ఇంటర్ విద్యార్థి ఆవేదన..
అకారణంగా తన పై అధ్యాపకుడు చేయి చేసుకున్నాడంటూ మనస్థాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
దిశ, పరిగి : అకారణంగా తన పై అధ్యాపకుడు చేయి చేసుకున్నాడంటూ మనస్థాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిగి మండల పరిధిలోని జాఫర్ పల్లి ఆదర్శ పాఠశాలలో బుధవారం చోటు చేసుకుంది. విద్యార్థి తండ్రి సీహెచ్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం తన కొడుకు సీహెచ్ శివకుమార్ జాఫర్ పల్లి మాడల్ (ఆదర్శ ) కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలో మరి కాసేపట్లో స్టడీ అవర్ ఉంది కదా అంటూ బుధవారం బయటికి వెళ్లాడు. తిరిగి క్లాసులోకి వస్తుండగా ఇంగ్లీషు సబ్జెక్టు చెప్పే అధ్యాపకుడు మురళీధర్ విద్యార్థి శివకుమార్ ను రూంలోకి ఈడ్చుకు వెళ్లాడు.
చెవి పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్లడమే కాకుండా వీపు, తల పై కొట్టాడంటూ తల్లిదండ్రుల ముందు బోరున విలపించాడు. తోటి స్నేహితుల ముందు అంతలా కొట్టడంతో తనకు చాలా బాధగా, అవహేళనగా అనిపించిందని తాను బతకను చచ్చి పోతానంటూ తల్లిదండ్రుల ముందు ఏడ్చేశాడు. దీంతో భయానికి గురైన తల్లిదండ్రులు మేము మీ సార్ తో మాట్లాడుతామంటూ కొందరు గ్రామస్తులతో కలిసి అధ్యాపకుడు మురళీధర్ ను ప్రశ్నించాడు. వారి కొడుకుదే తప్పని ఉపాధ్యాయున్నే కొట్టేందుకు వచ్చాడంటూ చెప్పాడు. దీంతో కొంత సేపు విద్యార్థి తండ్రి, ఉపాధ్యాయుని మధ్య వాగ్వివాదం జరిగింది. అంతటితో ఆగకుండా అధ్యాపకుడు అవును కొట్టాను మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ వెళ్లిపోయాడు. విద్యార్థి తండ్రి శ్రీనివాస్ ఉన్నతాధికారులకు, పరిగి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపాడు.