యూనివర్సిటీ భూములను ప్రొటెక్ట్ చేయాలి.. మంత్రి తుమ్మల నాగేశ్వరావు

యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రొటెక్ట్ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Update: 2024-12-19 07:12 GMT

దిశ, శంషాబాద్ : యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రొటెక్ట్ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు పీజేటీఏయూ వజ్రోత్సవ వేడుకలు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని పీజేటీఏయూలో క్యాంపస్ లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో గురువారం పిజేటీఏయూ వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్యతో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు వేడుకలు జరిగే ప్రాంగణాన్ని పరిశీలించారు. స్టేజి ఏర్పాటు చేసే ప్రాంతంలో మార్పులు చేయాలని, ఏర్పాట్లను చూస్తే వ్యవసాయం కనిపించే విధంగా ఉండాలని సూచించారు.

ఈ వజ్రోత్సవ వేడుకలకు ఎంతమంది రైతులు పాల్గొంటున్నారు, ప్రతినిధులు ఎంత వస్తున్నారో వివరాలు సేకరించారు. అనంతరం స్టేజి వద్ద వ్యవసాయం కనిపించే విధంగా మొక్కలు, ఫోటో ఎగ్జిబిషన్ ఉండే విధంగా చూడాలన్నారు. యూనివర్సిటీకి గతంలో ఎన్ని భూములు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని భూములు ఉన్నాయని యూనివర్సిటీ అధికారులను అడిగి వివరాలు సేకరించారు. ఇప్పుడు ప్రస్తుతానికి 1400 ఎకరాల భూములు ఉన్నాయని అధికారులు మంత్రికి తెలియజేయడంతో ఆ భూములను ప్రొటెక్ట్ చేయాలన్నారు. యూనివర్సిటీకి వస్తేనే ఒక వ్యవసాయం గుర్తు ఉండేలా ఉండాలి కానీ యూనివర్సిటీలో ఎక్కడ వ్యవసాయానికి సంబంధించిన షెడ్యూల్ కనిపించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ యూనివర్సిటీ కన్నా గ్రామాల్లో ఉండే నర్సరీలు మేలు అన్నారు. ఇప్పటికైనా భావితరాలకు అవసరపడే చెట్లను నాటాలని సూచించారు. వజ్రోత్సవాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజన వసతులు కూడా సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News