పేదల ఇళ్ల స్థలం విక్రయానికి కుట్ర.. 25 ఏళ్లుగా కొలిక్కిరాని సమస్య

మాడ్గుల మండలం సుద్దపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రమణంపల్లి గ్రామ రెవెన్యూ శివారు సాగర్ జాతీయ రహదారి సమీపంలోని పేదల ఇళ్ల స్థలం విక్రయానికి కుట్ర సాగుతున్నది.

Update: 2024-12-19 02:47 GMT

దిశ, మాడ్గుల: మాడ్గుల మండలం సుద్దపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రమణంపల్లి గ్రామ రెవెన్యూ శివారు సాగర్ జాతీయ రహదారి సమీపంలోని పేదల ఇళ్ల స్థలం విక్రయానికి కుట్ర సాగుతున్నది. సర్వేనెంబర్ 33/1అ, 34/1అ లో పేదల భాగస్వామ్యంతో విఆర్ఓ సంస్థ కొనుగోలు చేసిన భూమిని అందరూ భాగస్వాములు విక్రయించే కుట్ర పన్నుతున్నారని బాధిత పేదలు ఆరోపిస్తున్నారు. సుమారు 25 ఏళ్ల క్రితం గ్రామ శివారులో సుద్ధపల్లి, అర్కపల్లి, ఇర్విన్ గ్రామాల్లో 44 మంది ఇండ్లు లేని నిరుపేదలను వీఆర్వో సంస్థ గుర్తించి ఒక్కొక్కరి నుంచి రూ.4,500 వసూలు చేశారు. సంస్థ కొంత నిధులు వెచ్చించి ఇండ్లు నిర్మించి ఇస్తామని ఐదు ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశారు. అదే సమయంలో నిధులు చెల్లించిన పేదలు సంస్థపై అనుమానం వ్యక్తం చేయడంతో ఆ భూమిని కొండూరు యాదయ్య పేరిట 1.02, ఆర్కపల్లి గ్రామానికి చెందిన ఆదిమల్ల భిక్కయ్య పేరిట 1.2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి సంస్థ పేరుపై కొంత భూమిని ఉంచి సుమారు 20 ఇండ్లు నిర్మాణం చేశారు.

కొన్ని ఏళ్ల క్రితం బిక్కయ్య మృతిచెందగా.. ఆయన కూతురు సుజన పేరిట, యాదయ్య మృతితో భార్య మంగమ్మ పేరిట ఆ భూమి బదిలీ అయ్యింది. ఇదే అదునుగా భావించిన వారు కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని సొమ్ము చేసుకొని లబ్ధి పొందాలని చూస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలమైన తమ ఇండ్ల కోసం కొనుగోలు చేసిన భూమి తమకే దక్కాలని వారు పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసి కొనుగోలు చేసిన భూమి లో ఇండ్ల నిర్మాణం చేపట్టి దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.

పట్టా భూమి పరిరక్షణపై మాకు అధికారం లేదు..

రమణంపల్లి రెవెన్యూ పరిధిలోని 33 సర్వేనెంబర్ పూర్తిగా పట్టా భూమి. ఆ పట్టా భూమ పరిరక్షణ మా పరిధికి రాదు. గతంలో ఈ సర్వే నంబర్‌లో ఉన్న భూమి వీఆర్వో సంస్థ ప్రజల భాగస్వామ్యంతో కొనుగోలు చేసి కొన్ని ఇండ్లను నిర్మించారు. ఇప్పుడు మాత్రం ఎలాంటి కార్యకలాపాలు చేయడం లేదు. ఈ విషయంపై బాధితులు తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.:- వినయ్ సాగర్, తహశీల్దార్

బాధితులకు న్యాయం చేయండి..

కొన్ని సంవత్సరాల క్రితం వీఆర్ఓ సంస్థ తమకు ఇండ్లను కట్టిస్తామని ఇప్పటివరకు ఒక్కొక్కరి దగ్గర సుమారుగా రూ.20 వేల వరకు వసూలు చేశారు. నాతోపాటు ఇంకో 40 మంది బీద ప్రజలు ఉన్నారు. వారికి ఇండ్లు లేక హైదరాబాదుకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారు. గూడు లేని మాకు తమకు కేటాయించిన భూమిలో ఇళ్లను కట్టించి ఆదుకోవాలి.:- దేవరకొండ లక్ష్మమ్మ, బాధితురాలు


Similar News