మల్లప్పగుట్టపై 4 హుండీలు చోరీ.. గర్భగుడి తాళాలు ధ్వంసం..

మండలంలోని చెన్నారం గ్రామ సమీపంలో ఎత్తైన గుట్టలపై

Update: 2024-12-18 15:07 GMT

దిశ, తలకొండపల్లి : మండలంలోని చెన్నారం గ్రామ సమీపంలో ఎత్తైన గుట్టలపై వెలసిన మల్లప్ప గుట్ట మల్లికార్జున స్వామి దేవాలయం లో సోమవారం రాత్రి ఇద్దరు దుండగులు నాలుగు హుండీలను, గర్భగుడి తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల దేవాలయాల్లో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయని పోలీసులు ఆలయ నిర్వాహకులకు ముందుగానే సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆలయ నిర్వాహకులు గత 20 రోజుల క్రితమే మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో దుండగులు గుర్తు పట్టకుండా రాత్రి సమయం కావడంతో ముఖాలకు మాస్కులను ధరించి దర్జాగా దేవాలయ ప్రాంగణంలో నాలుగు హుండీలను పగలగొట్టి ధ్వంసం చేశారు.

అదేవిధంగా గర్భగుడికి ఉన్న ఇనుప డోర్లకు వేసిన తాళాలను కూడా పగులగొట్టి లోనికి ప్రవేశించారు. గర్భగుడిలో ఉన్న కొన్ని విలువైన సామగ్రి చోరీకి గురైనట్లు తెలుస్తుంది. సోమవారం ఆలయ ప్రధాన నిర్వహకుడు కల్లు పెంటారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మండలంలో ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. సోమవారం రోజు ఆరుద్ర నక్షత్రం ఉండడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో గుట్టపైకి చేరుకొని శివునికి అభిషేకం నిర్వహించడానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చినట్లు ఆలయ పూజారి మహేష్ అయ్యగారు పేర్కొన్నారు. ఇప్పటికైనా పోలీసులు చోరీకి పాల్పడిన దొంగల ఆచూకీ గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.


Similar News