భారీ ఈదురు గాలులతో వర్షం.. ఆయా గ్రామాల్లో కరెంటు కట్
రంగారెడ్డి జిల్లాలో గురువారం రాత్రి వీచిన భారీ ఈదురు గాలులు, వర్షానికి కరెంటు లేక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దిశ, తలకొండపల్లి : రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండల కేంద్రంలో గురువారం రాత్రి వీచిన భారీ ఈదురు గాలులు, వర్షానికి పలు గ్రామాలలో కరెంటు లేక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ ఈదురుగాళ్లకు మామిడికాయలు భారీ స్థాయిలో నెలరాలడంతో రైతులు కన్నీరు మునిరవుతున్నారు. మండల కేంద్రంలో ఒక మోస్తరుగా భారీ వర్షం కురిసింది. తలకొండపల్లి ట్రాన్స్ కో అధికారులు వెంటనే రంగంలోకి దిగి రావిచెడు, పడకల్, చెల్లంపల్లి, వెంకటాపూర్ తండాలలో అర్ధరాత్రి రెండు గంటల వరకు తెగిపోయిన విద్యుత్ కేబుల్ వైర్లను సరిచేసి చివరకు కరెంటు వచ్చే విధంగా కృషి చేశారు.
కానీ తలకొండపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో, కబరకిస్తాన్ దగ్గర, టీవీ టవర్, రాయిగుంట దగ్గర ఉన్న విద్యుత్ స్తంభాలు విరిగి పడడంతో ట్రాన్స్ కో అధికారులు ఏమి చేయలేకపోయారు. శుక్రవారం మధ్యాహ్నం లోపు విరిగిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ను పునరుద్ధరీకరిస్తామని ట్రాన్స్ కో ఏడీ శ్రీనివాస్ దిశతో మాట్లాడుతూ పేర్కొన్నారు. భారీ ఈదురు గాలులు వర్షానికి కరెంటుకు అంతరాయం కలగడంతో గురువారం రాత్రి మొత్తం ట్రాన్స్ కో అధికారులు ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్, లైన్మెన్లు, జేఎల్ఎం లు నిద్రాహారాలు మాని తెల్లవారులు కరెంటు పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం సుమారు 8 స్తంభాలు విరిగినట్టుగా మా సిబ్బంది గుర్తించారని, మరి కొన్ని స్తంభాలు విరిగి ఉండవచ్చని, వ్యవసాయ పొలాల వద్ద విరిగిన స్తంభాలు గుర్తించడానికి కాస్త సమయం పడుతుందని ఏడీ పేర్కొన్నారు.