అధికంగా తీసుకున్న వడ్డీని ఎస్‌హెచ్‌జీలకు తిరిగి చెల్లించండి.. మంత్రి హరీశ్ రావు ఆదేశం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారమే ఎస్‌హెచ్‌జీ (స్వయం సహాయక బృందాల) ల రుణాలకు వడ్డీ రేటు అమలు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు.

Update: 2022-12-23 09:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారమే ఎస్‌హెచ్‌జీ (స్వయం సహాయక బృందాల) ల రుణాలకు వడ్డీ రేటు అమలు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, అధికంగా వసూలు చేసిన సొమ్మును వడ్డీతో సహా ఎస్ హెచ్ జిలకు నెలరోజుల్లో చెల్లించాలని మంత్రి ఆదేశించారు. మంత్రి హరీష్ రావు అధ్యక్షతన శుక్రవారం స్టేట్ లెవ‌ల్ బ్యాంక‌ర్స్ కమిటీ 35వ సమీక్ష సమావేశం ఎంసిఆర్ హెచ్ఆర్డిలో జరిగింది. సమీక్షలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎస్ ఎల్ బి సి కన్వీనర్ డేబశిష్ మిత్రా, ఎస్ ఎల్ బి సి ప్రెసిడెంట్ అమిత్ జింగ్రాన్, నాబార్డ్ సిజిఎం చింతల సుశీల, ఆర్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ కే ఎస్ చక్రవర్తి, అన్ని బ్యాంకుల ప్రతినిధులు, రైతు, చిన్న పరిశ్రమల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. స్వయం సహాయక బృందాలు సకాలంలో, పూర్తిస్థాయిలో వడ్డీలు చెల్లిస్తూ ఆదర్శంగా ఉన్నాయన్నారు. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం అధికంగా వడ్డీ వసూలు చేస్తున్నాయన్నారు. నిబంధ‌న‌ల ప్రకారం, రూ. 3ల‌క్షల లోపు రుణాల‌కు 7శాతం, రూ. 3ల‌క్షల నుంచి రూ.5ల‌క్షల‌కు వ‌ర‌కు 10శాతం వ‌డ్డీ రేటు అమ‌లు చేయాల‌ని సూచించారు. మారిన వ‌డ్డీ రేట్లను అమ‌లు చేయ‌డం లేద‌ని, దీని వ‌ల్ల ఎస్‌హెచ్‌జీలు, ప్రభుత్వం న‌ష్టపోయే అవ‌కాశం ఉంద‌న్నారు. అన్ని బ్యాంకులు త‌క్షణం ఆర్‌బీఐ నిబంధ‌న‌లు అనుస‌రించాల‌ని ఆదేశించారు. 2022-23కు గాను అధికంగా వ‌సూలు చేసిన వ‌డ్డీని ఎస్‌హెచ్‌జీల‌కు తిరిగి చెల్లించాల‌ని ఆదేశించారు. బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు, ఇన్స్పెక్షన్, పోర్ట్ ఫోలియో, మెంటేయినేన్స్ వంటి సేవల పేరుతో రూ.500 నుంచి రూ.5000 వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. అయితే మొబిలైజేషన్, ఎంసిపి ప్రిపరేషన్, డాక్యుమెంటేషన్, మానిటరింగ్, రికవరీ వంటి సేవలను సెర్ప్ సిబ్బంది నిర్వహిస్తున్నారని చెప్పారు. కాబట్టి బ్యాంకులు ఎస్‌హెచ్‌జీల‌ రుణాలకు చార్జీలను వసూలు చేయడంలో ఎలాంటి అర్థం లేదన్నారు.

మొబిలైజేషన్, ఇతర సేవలను వీవోలు నిర్వహిస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. కాబట్టి బ్యాంకర్లు వడ్డీల్లో కొంత భాగం వీవోలు (విలేజ్ ఆర్గనైజర్లు), ఎంఎస్(మండల సమాఖ్య), జెడ్ఎస్ (జిల్లా సమాఖ్య)లకు ఇవ్వాలని మంత్రి సూచించారు. ఇప్పటికే మెదక్ డిసిసిబి బ్యాంకు వడ్డీలో ఐదు శాతం ఇచ్చేందుకు ఎంవోయూ కుదుర్చుకున్నదని చెప్పారు. ఒకే బ్యాంకు వేర్వేరు బ్రాంచుల్లో వేర్వేరుగా రుణాలపై వడ్డీలు, ఇన్స్పెక్షన్, ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు తీసుకోవడం సరికాదన్నారు. ఈ అంశాలపై పూర్తి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు.

విద్య, వైద్యం, గృహ సంబంధ, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ ప్రభుత్వ ప్రాధాన్య రంగాలకు రుణాలు ఎక్కువగా ఇచ్చి, ప్రజల అభివృద్ధికి తోడ్పడాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. డైరీ, ఫిషరీస్ సంబంధిత రుణ దరఖాస్తులు తిరస్కరించకుండా అర్హులకు రుణాలు మంజూరు చేయాలన్నారు. సీఎం కేసీఆర్ గారి ఆలోచనతో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ఆయిల్ సాగుకు రుణాలు ఎక్కువగా ఇవ్వాలని, జాతీయ, రాష్ట్ర, రైతు సంక్షేమానికి ఇది దోహదపడుతుందన్నారు. ఎంఎస్ఎమ్ఈ పరిశ్రమలకు రుణాల మంజూరుకు ప్రాధాన్యం ఇవ్వాలనీ సూచించారు. బ్రిడ్జి లోన్లు మంజూరు చేసే విషయంలో ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. తీసుకున్న నిర్ణయాల్లో పురోగతిని వచ్చే త్రైమాసిక మీటింగ్ తెలపాలని ఆదేశించారు.

Tags:    

Similar News