ఈ నెల 18న కేటీఆర్‌తో పాటు నలుగురు సాక్షుల స్టేట్‌మెంట్ రికార్డు

సినీ నటులు అక్కినేని నాగచైతన్య, సమంతల విడాకుల వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ ఈ నెల 2వ తేదీన చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను సోమవారం విచారించిన నాంపల్లి ప్రత్యేక కోర్టు తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.

Update: 2024-10-14 17:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సినీ నటులు అక్కినేని నాగచైతన్య, సమంతల విడాకుల వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ ఈ నెల 2వ తేదీన చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను సోమవారం విచారించిన నాంపల్లి ప్రత్యేక కోర్టు తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. కేటీఆర్‌తో పాటు ఆ పిటిషన్‌లో సాక్షులుగా పేర్కొన్న బాల్క సుమన్, సత్యవతి రాధోత్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌ల స్టేట్‌మెంట్లను కోర్టు రికార్డు చేయనున్నది. పిటిషన్‌లో పేర్కొన్న అంశాలతో పాటు ప్రేయర్‌లో లేవనెత్తిన విషయాలను వారు స్టేట్‌మెంట్ల రూపంలో కోర్టుకు తెలియజేయనున్నారు.

ఇప్పటికే అక్కినేని నాగార్జున విడిగా పరువునష్టం దావాను వేయడంతో ఆయనతో పాటు పిటిషన్‌లో సాక్షలుగా పేర్కొన్న సుప్రియ, వెంకటేశ్వర్లు స్టేట్‌మెంట్లు రికార్డయ్యాయి. కేటీఆర్, మరో నలుగురి సాక్షుల స్టేట్‌మెంట్లను కూడా రికార్డు చేసిన తర్వాత ఈ నెల 23న జరిగే విచారణకు మంత్రి కొండా సురేఖ హాజరుకావాల్సి ఉన్నది. ఇప్పటికే నాంపల్లి కోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు అనుగుణంగా ఆమె వ్యక్తిగతంగా హాజరవుతారా?... లేక న్యాయవాదిని పంపిస్తారా?.. అనేది స్పష్టం కావాల్సి ఉంది.

ఆ నోటీసు ప్రకారం కొండా సురేఖ స్టేట్‌మెంట్‌ను కూడా నాంపల్లి కోర్టు రికార్డు చేసే అవకాశాలున్నాయి. అందరి స్టేట్‌మెంట్లను తీసుకున్న తర్వాత పిటిషన్లపై కోర్టు జరిపే విచారణలకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది హాట్ టాపిక్‌గా మారింది. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు సమంతను ఉద్దేశిస్తూ మంత్రి కొండా సురేఖ ఓపెన్‌గానే క్షమాపణలు చెప్పారు.


Similar News