సినీ ఇండస్ట్రీపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్

తెలంగాణ సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ఇవ్వడమే కాక ప్రోత్సహిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. తెలంగాణ సినీ పరిశ్రమ దేశానికే కాక ప్రపంచ స్థాయికి ఎదిగి శాసించేలాగా మారాలని అన్నారు.

Update: 2024-10-14 17:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ఇవ్వడమే కాక ప్రోత్సహిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. తెలంగాణ సినీ పరిశ్రమ దేశానికే కాక ప్రపంచ స్థాయికి ఎదిగి శాసించేలాగా మారాలని అన్నారు. గద్దర్ సినీ అవార్డుల కమిటీ తొలి సమావేశంలో పాల్గొన్న స,దర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ సమాజాన్ని గద్దర్ తన ఆట, మాట, పాట ద్వారా ప్రభావితం చేశారని, తెలంగాణకు ఆయన ప్రతిరూపం అని కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, భావోద్వేగాన్ని పొడుస్తున్న పొద్దు మీద... పాట ద్వారా మొత్తం సమాజాన్ని ఉర్రూతలూగించారని, ఈ శతాబ్దంలో అలాంటి కళాకారులు పుడతారని తాను భావించడం లేదని, అందుకే ఆయన ఓ లెజెండ్ అని ప్రశంసించారు. “తెలంగాణ అంటేనే ఆట, పాట.. ఇక్కడ బాధ వచ్చినా... సంతోషం వచ్చినా... పాట ద్వారానే వ్యక్తపరుస్తాం” అని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆట పాటలను ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి గద్దర్ అని అన్నారు. రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా గద్దర్‌లాగే పాడాలని ప్రయత్నిస్తుంటారని, ఆయనను అనుకరిస్తుంటారని, అందుకే తెలంగాణ మొత్తానికే ఆయన ప్రతిరూపమన్నారు.

అడవి, సినిమా, మానవ సమాజం, రాజ్యాంగం.. ఇలా అన్నింటా గద్దర్ తనదైన ముద్ర వేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తుచేశారు. తొలుత విప్లవోద్యమ బాటలో అడవిబాట పట్టినా కాలక్రమంలో దేశంలోని అన్ని సమస్యలకూ భారత రాజ్యాంగమే పరిష్కారమని భావించడమే కాక బలంగా విశ్వసించి దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారని పేర్కొన్నారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరిట సినిమా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించిందని కమిటీ సభ్యులకు డిప్యూటీ సీఎం వివరించారు. అన్ని అవార్డుల తరహాలోనే అన్ని రంగాలకూ గద్దర్ అవార్డులు ఇచ్చుకోవచ్చన్నారు. సినీ పరిశ్రమలోని అందర్నీ గౌరవించుకోవాలి.. ప్రతీ అవార్డు గొప్పగా ఉండాలి... ఇదే రాష్ట్ర ప్రభుత్వం విధానమని స్పష్టం చేశారు. గద్దర్ అవార్డుల కార్యక్రమం గొప్ప పండుగలా జరగాలని, ఏ తేదీన జరపితే బాగుంటుందో ఆ రంగ ప్రముఖులుగా మీరు సూచిస్తే కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. గద్దర్‌ను అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని, త్వరలోనే కమిటీ మరో మారు సమావేశమై నిర్ణయాలు తీసుకుంట మంచిదని డిప్యూటీ సీఎం తన అభిప్రాయాన్ని ఈ సమావేశంలో వెల్లడించారు.

సచివాలయంలో సోమవారం గద్దర్ సినీ అవార్డుల కమిటీ మొదటి సమావేశంలో... సినీ పరిశ్రమకు ఏ సమస్యలు ఉన్నా వినడానికి, పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని, సీఎం రేవంత్‌రెడ్డి సైతం ఈ మాటను మీతో పంచుకోవాల్సిందిగా ప్రత్యేకంగా కోరారని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డుల ప్రదాన కార్యక్రమం ఒక పండుగలా జరిగేదని, రాష్ట్ర విభజన తర్వాత గత ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదన్నారు. తెలంగాణ అంటేనే సాంస్కృతిక జీవనమని, ఈ సంస్కృతి చాలా గొప్పదని, అందర్నీ అక్కున చేర్చుకొని, ప్రేమించే సంస్కృతి ప్రత్యేకత అని అన్నారు. అసమానతలు, వైరుధ్యాల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు పోరాటం ద్వారా ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నారని వివరించారు. గద్దర్ సినీ అవార్డుల కమిటీ సభ్యులు బి.నర్సింగరావు, నటుడు తనికెళ్ల భరణి, నిర్మాత సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, దిల్ రాజు, హరి శంకర్, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, గద్దర్ భార్య గుమ్మడి విమల, గద్దర్ కుమార్తె వెన్నెల తదితరులు ఈ సమావేశంలో పాల్గొని వారి అభిప్రాయాలను వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాన్సెప్ట్ అద్భుతమైనదంటూ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. స్కిల్ యూనివర్సిటీలో యాక్టింగ్ స్కిల్స్ నేర్పించేందుకు ప్రత్యేక కోర్సును ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎంకు సూచించారు. అన్ని అంశాలు పరిశీలించి ఇంటిగ్రేటెడ్ స్కూల్, స్కిల్ యూనివర్సిటీలో యాక్టింగ్, కల్చర్‌కు సంబంధించిన అంశాలకు చోటు కల్పించడంపై నిర్ణయం తీసుకుంటామని వారికి డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ సమావేశంలో ఫైనాన్స్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సమాచార శాఖ కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.


Similar News