కమిట్‌మెంట్‌తో ఉన్నాం.. ఆ కంపెనీ ప్రతినిధులకు సీఎం రేవంత్ హామీ

మారుతున్న అవసరాలకు అనుగుణంగా బ్యాటరీ రంగంలోకి కూడా ఎంటర్ కావాలని ఫాక్స్ కాన్ ప్రతినిధులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆహ్వానించారు.

Update: 2024-10-14 16:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మారుతున్న అవసరాలకు అనుగుణంగా బ్యాటరీ రంగంలోకి కూడా ఎంటర్ కావాలని ఫాక్స్ కాన్ ప్రతినిధులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆహ్వానించారు. ఎలక్ట్రానికి, లిథియం బ్యాటరీల వినియోగం దేశమంతా పెరుగుతున్నదని, ఆ రంగంలో వస్తున్న అవకాశాలను వినియోగించుకుని అనుగుణమైన ప్లాంట్‌లను రాష్ట్రంలో నెలకొల్పాలని కోరారు. ఈ యూనిట్ల స్థాపన కోసం పెట్టుబడులు పెట్టాలని రిక్వెస్టు చేశారు. ప్రభుత్వం తరఫున అవసరమైన మౌలిక సౌకర్యాలను కల్పించడానికి సిద్ధంగా హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో నిర్మాణమవుతున్న ఫాక్స్ కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ (ఫిట్) ఫ్యాక్టరీ పురోగతిపై స్పాట్‌లోనే ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం సోమవారం సాయంత్రం సమీక్షించారు. నిర్మాణపు పనులను, తాజా స్టేటస్‌ను క్షేత్రస్థాయిలో రివ్యూ చేశారు. కంపెనీకి అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ‘ఫిట్’ చైర్మన్, సీఈఓ సిడ్నీ లియూతో పాటు ఫాక్స్ కాన్ గ్రూపు కంపెనీ చైర్మన్ యాంగ్ లియూతోనూ ఆ ఫ్యాక్టరీ ప్రాంగణం నుంచే వీడియో కాన్ఫరెన్సులో సీఎం రేవంత్ మాట్లాడారు.

వీడియో కాన్ఫరెన్సు సందర్భంగా యూనిట్ నిర్మాణానికి సంబంధించిన కొన్ని ఆపరేషనల్ సమస్యలను ఇద్దరు చైర్మన్లు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే అక్కడే ఉన్న అధికారులకు వివరించి ఆ లోపాలన్నింటినీ చక్కదిద్దాలని ఆదేశించారు. ‘ఫిట్’ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కమిట్‌మెంట్ ప్రకారం అన్నింటినీ సమకూరుస్తుందని, ఎలాంటి అనుమానాలు అవసరం లేదని కంపెనీ ప్రతినిధులు, చైర్మన్లకు సీఎం నొక్కిచెప్పారు. ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ పనులకు మాత్రమే కాక పూర్తిస్థాయిలో ఈ యూనిట్ ఫంక్షనింగ్‌లోకి వచ్చిన తర్వాత భవిష్యత్తు అవసరాలు, ఆపరేషన్లకు కూడా ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా కల్పించారు. పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు సహా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ జయేశ్‌రంజన్, జిల్లా కలెక్టర్ శశాంక తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.


Similar News