కిషన్ రెడ్డి మాటలు తప్ప... చేతలు శూన్యం: మాజీ మంత్రి రవీంద్ర నాయక్

బీఆర్ఎస్ పాలనలో ఆగమైన తెలంగాణను గాడిలో పెడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేదని మాజీ మంత్రి ధరావత్ రవీంద్ర నాయక్ అన్నారు.

Update: 2024-10-14 17:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పాలనలో ఆగమైన తెలంగాణను గాడిలో పెడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేదని మాజీ మంత్రి ధరావత్ రవీంద్ర నాయక్ అన్నారు. సోమవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. కిషన్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయే తప్ప చేతలు మాత్రం శూన్యమని మండిపడ్డారు. బీఆర్ఎస్ పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చినప్పుడు ఇంటెలిజెన్స్, ఐబీలు ఏం చేశాయని దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణను దోచుకొని లక్ష కోట్ల అప్పుల్లో ముంచి ఫాం హౌజ్ లు నిర్మించుకున్నారని, రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని పీఎం సైతం బహిరంగ వేదికలపై చెప్పారని అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. కాగ్ రిపోర్టులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు చేపట్టిన కార్యక్రమాలన్నీ బొగసని, అవినీతిలో కూరుకుపోయాయని ఎన్నోసార్లు రిపోర్టులు ఇచ్చినా ఐదేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎందుకు జాప్యం చేశారని నిలదీశారు.

ఇప్పుడేమో కిషన్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప కనీసం రాష్ట్రానికి ప్రత్యేక ప్రాజెక్టులు కానీ, నిధులు గానీ తెచ్చే చేతకాని కేంద్ర మంత్రి అని ధ్వజమెత్తారు. కేసీఆర్ బీజేపీ పార్టీకి పేటీఎం అయినందునే కేంద్రం కేసీఆర్ కుటుంబం అవినీతి పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. గతంలో వచ్చిన వరదలకు 2 వేల కోట్లు నష్టం జరిగిందని సహాయం అడిగితే కేంద్రం కేవలం 400 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుని తెలంగాణ ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి మాత్రం మొండిచెయ్యి చూపిస్తున్నారన్నారు. బీజేపీ ఎంపీలంతా మోడీని కలిసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమై దివాలా తీసిన విషయం, కుంభకోణాలను వివరించాలని కోరారు. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించాలని పీఎం వద్ద ఎందుకు మాట్లాడటం లేదో తెలంగాణ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.


Similar News