దిశ ప్రతినిధి, నిజామాబాద్: గత నెల 25న ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై జరిగిన దాడిని పసుపు రైతులు తీవ్రంగా ఖండించారు. అంతేగాక, ఆ దాడితో రైతులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. శనివారం ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డులో గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన రైతులతో పాటు పసుపు రైతులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు కావాల్సినవి పోరాటాలు చేసి సాధించుకుంటాం తప్ప, దాడులు చేయబోమని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రమైన ఏపీలో పసుపు రైతులకు బోనస్ ప్రకటించిన మాదిరి తెలంగాణ రాష్ట్రంలో కూడా బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతు ఐక్యవేదిక పేరుతో కొంతమంది రాజకీయ నాయకులు, వారి రాజకీయ లబ్ధి కోసం డ్రామాలాడుతున్నారని రైతులు ప్రకటించారు. రైతు ఉద్యమంలో పాల్గొనే రాజకీయ పార్టీ నాయకులు తమ పదవులను స్వచ్ఛందంగా వదిలి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. మార్కెట్ ఇంటర్వేన్షన్ స్కీం కింద పసుపు మద్దతు ధర కోసం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని, అదేవిధంగా అకాల వర్షాల కారణంగా పసుపు పంట తీవ్రంగా నష్టపోయినందున కేంద్ర ప్రభుత్వ సాయంతో రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని పసుపు రైతులు తీర్మానం చేశారు.