ధాన్యం కుప్పల వద్ద రైతులకు తప్పని తిప్పలు

రేయింబవళ్లు కష్టపడి పండించిన ధాన్యం రోడ్లపై ఎండబెడితే కుక్కలు, కోతులు రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి.

Update: 2024-11-25 12:22 GMT

దిశ, భిక్కనూరు :రేయింబవళ్లు కష్టపడి పండించిన ధాన్యం రోడ్లపై ఎండబెడితే కుక్కలు, కోతులు రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా కోతులతో సహవాసం వెళ్లదీయక పడరాని పాట్లు పడుతున్నారు. వీటికి తోడు ఊర పందులు రాత్రివేళ ధాన్యం కుప్పలపై చేరి బుక్కుతున్నాయి. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట డబ్బులు చేతికొచ్చే సమయంలో పందులు బుక్కుతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నెల రోజులుగా రైతులు వచ్చిన వరి ధాన్యాన్ని భిక్కనూరు మండల కేంద్రంతో పాటు జాతీయ రహదారి మొదలుకొని, మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న ప్రధాన రహదారులపై పోసి ఎండబెడుతున్నారు. తేమ శాతాన్ని పరీక్షించి, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ధాన్యాన్ని కాంటా చేయిస్తూ..గన్ని బ్యాగులలో నింపుతూ, లారీలలో లోడ్ చేయించి రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ధాన్యం ఎండబెట్టేందుకు స్థలం లేకపోవడంతో..చాలామంది రైతులు, ఖాళీ ఉన్న రోడ్లపై పోసి ఎండబెడుతున్నారు. రాత్రివేళ ధాన్యం కుప్పల వద్ద ఎవరు కాపలా ఉండకపోవడంతో, కుక్కలు వాటిపై ఆడుకుంటున్నాయి.  కోతులను వెళ్లగొట్టేందుకు ధాన్యం రైతులు ప్రయత్నిస్తే..రైతులపై దాడికి దిగుతున్నాయి. వీటికి తోడు ఊర పందులు కూడా బుక్కేందుకు అలవాటు పడడంతో..రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి తలెత్తింది.


Similar News