చకచకా పూర్తయిన కుటుంబ సర్వే..

నిజామాబాద్ జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 99.67 శాతం పూర్తయింది.

Update: 2024-11-26 03:03 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 99.67 శాతం పూర్తయింది. జిల్లాలోని 4,77,497 ఇళ్లకు సోమవారం నాటికి 4,75,900 ఇళ్లలో సర్వే సిబ్బంది సర్వేను నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. సర్వే మెల్లిగా ప్రారంభమై వేగంగా పూర్తయింది. ఒక్కో ఇంటికి ఎన్యూమరేటర్లు చాలా సార్లు తిరగాల్సి వచ్చింది. ప్రజలు మొదట్లో సహకరించకపోయినా తరువాత వారే ఎన్యూమరేటర్లకు బాగా సహకరించి వివరాలన్నీ ఓపిగ్గా వివరించారని, సర్వే సిబ్బందికి బాగా సహకరించారని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో మిగిలిపోయిన 1597 ఇళ్లు కూడా సర్వే పూర్తవుతుందన్నారు.

సర్వే వివరాలు అప్ లోడ్ చేస్తున్న సిబ్బంది..

ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సర్వేలో భాగంగా ఎన్యూమరేటర్లు ప్రజల నుంచి సేకరించిన వివరాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసే పనిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు తలమునకలై ఉన్నారు. అన్ని మండలాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చోట్ల సిబ్బంది వివరాలను సర్వే వివరాలను అప్ లోడ్ చేసే కార్యక్రమాన్ని డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యమ స్ఫూర్తితో చేస్తున్నారు. సర్వేవివరాలు అప్ లోడ్ చేసే క్రమంలో ఎలాంటి తప్పిదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు ఇప్పటికే అధికారులకు సర్వే సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడంతో మండలాల్లో అధికారులు దగ్గరుండి మరీ సర్వే వివరాలు అప్ లోడ్ చేయించే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.

ఈ నెల 6 నుంచి ప్రారంభమైన సర్వే..

ఈ నెల 6 నుంచి జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమైంది. 6, 7, 8 తేదీల్లో హౌజింగ్ లిస్టు పూర్తి కాగా, 9 నుంచి సమగ్ర సర్వే ప్రారంభమైంది. సర్వే కోసం జిల్లాను 3245 ఎన్యూమరేట్ బ్లాకులుగా విభజించారు. 545 గ్రామపంచాయతీలతో పాటు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఆర్మూర్, బోధన్, భీమ్‍గల్ మున్సిపాలిటీలను కూడా కలుపుకుని 3245 ఎన్యూమరేట్ బ్లాకులుగా విభజించి సర్వే కోసం ఏర్పాట్లు చేశారు. 175 ఇళ్లకు ఒక ఎన్యూమరేటర్ ను సర్వేకోసం నియమించారు. పది మంది ఎన్యూమరేటర్లను పర్యవేక్షణ చేసేందుకు ఒక సూపర్ వైజర్ ను ఏర్పాటు చేశారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చాలా పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసి సర్వేను పక్కాగా నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సర్వే కోసం ప్రైమరీ స్కూల్ టీచర్లను ఎన్యూమరేటర్లుగా నియమించారు. వీరు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం వరకు సర్వేను నిర్వహించారు.

సర్వే పూర్తి కావడంలో ఆలస్యం జరుగుతుండటంతో చాలా మంది టీచర్లు రాత్రి 8 గంటలు దాటాక కూడా పని చేసి సర్వే పూర్తి చేశారు. సర్వేలో ఉన్న ప్రశ్నలకు సంబంధించి ఇచ్చిన వివరాల గడులలో కోడ్ లు నమోదు చేయాల్సి ఉండటంతో చాలా మంది ఎన్యూమరేటర్లు మొదట్లో తికమక పడ్డారు. ప్రతిసారి వారికి ఇచ్చిన గైడ్ లైన్ బుక్ ను చూస్తూ వివరాల కోడ్ ను రాసుకోవడంతో ఎక్కువ సమయం సర్వేకోసం కేటాయించాల్సిన పరిస్థితి కలిగింది. ఒక్కో కుటుంబం వివరాలను సర్వే చేయడానికి అరగంటకు పైగా సమయం తీసుకున్నారు. దీంతో కొంచెం నెమ్మదిగా ఉన్న ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన బ్లాకుల్లో స్పీడుగా సర్వే చేయలేకపోవడంతో సర్వే పూర్తవడంలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు తర్వాత పుంజుకుని త్వరగా సర్వే పూర్తి చేస్తుండటంతో ఇక పై సర్వే వివరాల అప్ లోడ్ పైనే అధికారులు ఫోకస్ పెట్టారు. కామారెడ్డి జిల్లాలో కూడా 99.70 శాతం సర్వే పూర్తయినట్లేనని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో 3,02,135 ఇళ్లకు గాను, 3,01,135 ఇళ్లలో సర్వే పూర్తయింది. మరో వేయి ఇళ్లలో సర్వే పూర్తయితే వంద శాతం పూర్తయినట్లేనని చెపుతున్నారు. జిల్లాలోని 25 మండలాలకు 14 మండలాల్లో సర్వే వంద శాతం పూర్తికాగా, మరో 11 మండలాల్లో పూర్తికావాల్సి ఉందని తెలుస్తోంది. సర్వే వివరాలను ఆన్ లైన్ అప్ లోడ్ చేయడానికి 1200 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించినట్లు, వారంతా ఇదే పని మీద ఉన్నట్లు తెలుస్తోంది.


Similar News