Jajala Surender : రుణమాఫీ బూటకమని తేలిపోయింది

సీఎం రేవంత్ రెడ్డి ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లా దేవుళ్లపై ఒట్టు

Update: 2024-08-18 11:18 GMT

దిశ,కామారెడ్డి : సీఎం రేవంత్ రెడ్డి ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లా దేవుళ్లపై ఒట్టు వేసి ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారని, దేవుళ్ళ సాక్షిగా రుణమాఫీ బూటకమని తేలిపోయిందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో భాగమైన రైతు రుణమాఫీ 100 శాతం మాఫీ కాలేదన్నారు. ఏ సొసైటీకి వెళ్లినా 30, 40 శాతానికి మించి రుణమాఫీ కాలేదని చెప్తున్నారని, దీనిపై కాంగ్రెస్ నాయకులు చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు.

రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని తమ నాయకుడు హరీష్ రావు సవాల్ చేసారని, రుణమాఫీ పూర్తిస్థాయిలో కాకపోవడంతో ఎక్కడ సీఎంను నిలదిస్తారోనన్న భయంతో సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై అర్ధరాత్రి గుండాలతో దాడి చేయించారని ఆరోపించారు. దీనికి పోలీసులు వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. హరీష్ రావును భయపెడితే క్యాడర్ భయపడుతారని అనుకున్నారని, ఉద్యమ స్ఫూర్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఇలాంటి దాడులకు భయపడరని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. కొంత మంది రైతులకు రుణమాఫీ చేసి మొత్తం చేశామని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి రైతాంగానికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పై సీఎం రేవంత్ రెడ్డి తన డొల్లతనం బయటపడుతుందనే మాట్లాడటం లేదని విమర్శించారు. 2 లక్షల రుణమాఫీ చేసేవరకు ప్రతిపక్ష పార్టీగా పోరాడతామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. కళ్యాణాలక్ష్మి ద్వారా తులం బంగారం ఇస్తామని చెప్పినా 8 నెలలుగా పాత వారికి కూడా చెక్కులు ఇవ్వలేదని విమర్శించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ఇవ్వడం లేదన్నారు. వైరల్ జ్వరాలతో ఆస్పత్రుల్లో వైద్యులు లేక ప్రజలు అల్లాడుతుంటే ఇప్పటివరకు వైద్య శాఖపై సమీక్ష చేయలేదన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా చెత్తను తొలగించే వారని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. కాళేశ్వరం వృధా అన్నారని, ఇప్పుడు 4,5 క్యూసెక్కుల నీరు వెళ్తోందని తెలిపారు.

రైతుబంధు మే, జూన్ వరకు రైతులకు చేరేదని, దానికి రైతు భరోసా పేరు పెట్టి ఇప్పటికి ఇవ్వడం లేదన్నారు. విద్యార్థులకు ప్రతి నెల 10 వేలు ఇస్తామన్నారని, పీజీ విద్యార్థులకు లక్ష సహాయం చేస్తామని మోసం చేశారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఎక్కడ వస్తున్నాయో తెలియడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో జిల్లాలోని సదశివనగర్ మండలం లింగంపల్లి గ్రామంలో 800 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు చేశామని రాజకీయాలను పక్కన పెట్టి చిత్తశుద్ధి ఉంటే అక్కడ యూనిట్లు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలన్నారు. 9 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని, గ్రామగ్రామాన పాలభిషేకాలకు బదులు శవయాత్రలు చేస్తున్నారన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. ఆ పార్టీయే సరిగ్గా లేదని, అలాంటి పార్టీలో విలీనం పెద్ద జోక్ అన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ వ్యక్తి కాదని, శక్తి అన్నారు. బీఆర్ఎస్ కు పదవులు కొత్తేమి కాదన్నారు. 14 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి, పదేళ్లు అధికారంలో ఉన్నామని, మరో ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉంటామన్నారు.


Similar News