కోట్ల విలువైన గ్రామపంచాయతీ స్థలం.. అక్రమ కబ్జాకు పాల్పడుతున్న వైనం..
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని పెట్రోల్ పంపు ఎదురుగా ఉన్న కోట్లాది రూపాయల విలువైన గ్రామపంచాయతీ స్థలం కొందరు అక్రమార్కుల చేతుల్లో కబ్జాకు గురవుతుంది.
దిశ, నాగిరెడ్డిపేట : నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని పెట్రోల్ పంపు ఎదురుగా ఉన్న కోట్లాది రూపాయల విలువైన గ్రామపంచాయతీ స్థలం కొందరు అక్రమార్కుల చేతుల్లో కబ్జాకు గురవుతుంది. కోట్లాది రూపాయల విలువచేసే గ్రామపంచాయతీ స్థలాన్ని కొంతమంది వ్యక్తులు అక్రమంగా కబ్జా చేస్తున్నప్పటికీ గ్రామ పంచాయతీ అధికారులు గానీ, రెవెన్యూ అధికారులు కానీ తమకేమీ తెలియదన్నట్లుగా " మాములు" గా తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు కొంత మంది వ్యక్తులు బోధన్ - హైదరాబాద్ ప్రధాన రహదారి పక్కనే తాత్కాలికంగా రేకుల షెడ్లు వేసుకొని తమ తమ వ్యాపారాలను కొనసాగించారు. కాగా జాతీయ రహదారి రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా ఈ షెడ్లను రోడ్డు పక్క నుండి తొలగించాలని హైవే అథారిటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో ఇప్పటివరకు రోడ్డు ప్రక్కన నిర్వహించుకున్న రేకుల షెడ్డు యజమానులు తాజాగా షెడ్డు వెనకాల ఉన్న కోట్లాది రూపాయల విలువైన గ్రామపంచాయతీ స్థలాన్ని కబ్జాచేసి ఆ స్థలంలో షాపులు ఏర్పరచుకునేందుకు ట్రాక్టర్లతో మొరం నింపి గ్రామపంచాయతీ స్థలాన్ని కబ్జాకు పాల్పడుతున్నారు. నాగిరెడ్డిపేట్ ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఈ గ్రామ పంచాయతీ స్థలాన్ని గతంలో కొంతమంది వ్యక్తులు అక్రమ కబ్జాకు పాల్పడి ఇళ్ల నిర్మాణం కోసం ఫిళ్ళర్లు వేసి నిర్మాణం చేపడుతుండగా గతంలో ఉన్న ఉమ్మడి నాగిరెడ్డిపేట గ్రామ సర్పంచ్, గ్రామపంచాయతీ అధికారులు అక్రమ స్థలం కబ్జాను అడ్డుకొని గ్రామపంచాయతీ పరిధిలోకి స్వాధీనపరుచుకున్నారు. ప్రస్తుతం కొంతమంది వ్యక్తులు గ్రామపంచాయతీ స్థలాన్ని ఇంకా కబ్జాకు పాల్పడుతున్నప్పటికీ గ్రామపంచాయతీ, మండల పరిషత్, రెవెన్యూ అధికారులు ఎవరు కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ స్థలాన్ని అక్రమ కబ్జాదారుల నుంచి రక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
గోపాల్ పేట్ గ్రామపంచాయతీ కార్యదర్శి కిష్టయ్య
మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసి వ్యాపార దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్న వ్యక్తుల పై చర్యలు తీసుకొని గ్రామపంచాయతీ స్థలం నుండి దుకాణాలను తొలగిస్తామంటున్నారు గోపాల్ పేట్ గ్రామపంచాయతీ కార్యదర్శి కిష్టయ్య. కబ్జా చేస్తున్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కఠిన చర్యలు తీసుకుంటాం.