అద్దె బకాయిలు కట్టరా..

అధికారికంగా నిర్వహించిన టెండర్ లో పాల్గొని, వేలం పాటలో మడిగెలను దక్కించుకున్న వారిలో, సగం మంది వాటా ప్రకారం చెల్లించగా, మిగతావారు అసలు ప్లస్, అద్దె కిరాయిలు కూడా చెల్లించకుండా సతాయిస్తున్న వ్యవహారం పై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

Update: 2024-09-29 15:10 GMT

దిశ, భిక్కనూరు : అధికారికంగా నిర్వహించిన టెండర్ లో పాల్గొని, వేలం పాటలో మడిగెలను దక్కించుకున్న వారిలో, సగం మంది వాటా ప్రకారం చెల్లించగా, మిగతావారు అసలు ప్లస్, అద్దె కిరాయిలు కూడా చెల్లించకుండా సతాయిస్తున్న వ్యవహారం పై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టెండర్లలో పాల్గొన్న కొందరు, తమకు వచ్చిన మడిగెలకు పూర్తి డబ్బులు చెల్లించినప్పటికీ, సుమారు ఆరేళ్లుగా అద్దె చెల్లించకుండా సతాయిస్తున్నారు. అప్పట్లో అధికారులు జబర్దస్త్ చేసి కిరాయిల గురించి మాట్లాడితే వెయ్యో, రెండు వేలో అనుకున్నాం, కాని 3500 నుంచి నాలుగు వేల రూపాయలు ఒక మడిగెకు అద్దె చెల్లించాల్సి ఉంటుందని సర్కార్ గైడ్ లైన్స్ లో నిబంధన ఉంది. దీంతో షాక్ కు గురైన వారు, అంత పెద్ద మొత్తంలో అద్దెలు కట్టలేమని అధికారుల ముందు అప్పట్లోనే తేల్చి చెప్పారు. దీంతో ఈ వ్యవహారం పై వివాదం చెలరేగినప్పటికీ, ఆ తరువాత కొద్ది రోజులకు సైలెంట్ అయ్యింది.

జిల్లా కలెక్టర్ జోక్యంతో మళ్లీ ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ అంశం సీరియస్ గా మారడం, సమగ్ర నివేదిక తయారు చేసి పంపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించాడు. 2018 - 19 సంవత్సరంలో భిక్కనూరు మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో 23 మడిగెలతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం బహిరంగ వేలం వేశారు. వేలంపాటలో మెయిన్ రోడ్డుకు ఉన్న మడిగెలు మంచి ధర పలకగా, లోపలికి వెళ్లినాకొద్ది మడిగెల ధర తగ్గుతూ వచ్చింది. అయినా కట్టిన మడిగెలన్నింటికీ టెండర్ పలకడం, అధికారులు ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరినట్లు అయ్యింది. కాంప్లెక్స్ లోని మడిగెలను టెండర్ ద్వారా దక్కించుకున్న వారిలో కొందరు వాయిదాల ప్రకారం పేమెంట్లు చేసి తాళం చెవిలు హైండవర్ చేసుకున్నారు. మరికొందరు కొద్దికొద్దిగా పేమెంట్లు చేసి పలుకుబడి ఉపయోగించి తాళం చెవిలు అధికారుల వద్ద నుంచి తీసుకొని అద్దెకిచ్చారు.

సుమారు ఆరు సంవత్సరాలుగా వేలం పాటలో మడిగెలు దక్కించుకున్న వాటికి పూర్తి మొత్తం అమౌంట్ చెల్లించకపోవడంతో పాటు, అద్దె కూడా చెల్లించకుండా సతాయిస్తుండడం, ఇంకొందరు వాయిదాల ప్రకారం కిస్తీలు కట్టినప్పటికీ, ఇంతవరకు అద్దె కట్టకుండా పెండింగ్ లో ఉంచారు. దీంతో సుమారు 50 లక్షల రూపాయల వరకు, గ్రామ పంచాయతీకి ఆదాయం రావాల్సి ఉండగా రాకపోగా, ఈ విషయాన్ని అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. రెండు రోజుల క్రితం మండలంలోని జంగంపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విజిట్ కు వచ్చిన సమయంలో, ఇంచార్జి ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డితో మాట్లాడి అద్దెలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న టెండర్ దారులకు వెంటనే నోటీసులు పంపాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో కాంప్లెక్స్ కు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు, పూర్తి సమాచారంతో సమగ్ర నివేదికను తయారు చేసుకొని కలెక్టర్ వద్దకు వెళ్లాలని, అప్పుడు ఆయన చెప్పిన డైరెక్షన్ ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు అధికారులు చెబుతున్న మాట.


Similar News