గజ్జున వణికిస్తున్న చలి.. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు
ఉమ్మడి జిల్లాలో చలి.. రోజంతా చలే.. చలి పులి పంజా విసురుతుంది. వేకువజాము మొదలు దట్టమైన పొగమంచు కమ్మేస్తూ ఉదయం 9 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో చలి.. రోజంతా చలే.. చలి పులి పంజా విసురుతుంది. వేకువజాము మొదలు దట్టమైన పొగమంచు కమ్మేస్తూ ఉదయం 9 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు. సెద్దర్లు కప్పుకున్నా..స్వెటర్లు వేసుకున్నా.. మంకీ క్యాప్ పెట్టుకున్న.. మఫ్లర్ కట్టుకున్నా.. ప్రజలు గజగజ వణికిపోతున్నారు. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. గత కొద్ది రోజులుగా వాతావరణంలో మార్పుల కారణంగా చలి విపరీతంగా వణికిస్తోంది. గడిచిన నాలుగు రోజుల్లో ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు చాలా పడిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో కన్నా కామారెడ్డి జిల్లాలో చలి తీవ్రత ఎక్కువ ఉన్నట్లు వాతావరణ శాఖ రికార్డులు చెబుతున్నాయి.
గత మూడు రోజులుగా నిజామాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 13.8 డిగ్రీలు నమోదవుతుంటే కామారెడ్డి జిల్లాలో మూడు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10.0 డిగ్రీలు నమోదవుతున్నాయి. శుక్రవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ ప్రాంతంలో 9.4 డిగ్రీలు నమోదైంది. బిచ్కుంద లో 10.7 డిగ్రీలు నమోదైంది. మద్నూర్, గాంధారి, మాచారెడ్డి, భిక్కనూర్, పాల్వంచ, దోమకొండ, బిబిపేట్, పిట్లం బాన్సువాడ మండలాల్లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 11.1 నుంచి 11.9 డిగ్రీల వరకు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలుపుతోంది. జనవరి నెలలో ఈ చలి ఇంకా విపరీతంగా పెరిగి ఉష్ణోగ్రతలు ఇంకా తక్కువకు పడిపోతాయని అధికారులు చెబుతున్నారు.
చలి జిల్లా ప్రజలను వణికిస్తున్నది. వాతావరణంలో సంభవించిన పెను మార్పుల కారణంగా పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా చలిపులి పంజా విసురుతుంది. ప్రతిరోజు మార్నింగ్ వాక్ కు వెళ్లే అలవాటున్న వాకర్స్ తెల్లవారుజామున 5 గంటలకే నిద్రలేచి మార్నింగ్ వాక్ వెళతారు. కానీ, కొద్ది రోజులుగా పెరిగిన చలి కారణంగా వాకర్స్ ఉదయాన్నే లేవడం లేదు. చలికి భయపడి దుప్పటి కప్పుకుని ముసుగు తన్ని పడుకుంటున్నారు. ఉదయం 7 గంటలు దాటాక మార్నింగ్ వాక్ కు బయలు దేరుతున్నారు. ఉదయం 9 , 10 గంటల వరకు కూడా చలి వణికిస్తుండటంతో ఏ పనీ సమయానికి చేసుకోలేకపోతున్నామని జనాలు వాపోతున్నారు. బయట అడుగుపెట్టాలంటే చలికి భయపడి ఉదయం 10 దాటాకే ఏ పనికైనా బయటకు అడుగుపెడుతున్నారు. మోటార్ బైక్ పై వెళ్ళేవారు సైతం చలిలో వెళ్లడానికి ధైర్యం చేయలేకపోతున్నారు.
ఆలస్యంగా తెరుచుకుంటున్న షాపులు..
సాధారణ రోజుల్లో ఉదయం 9 గంటల్లోపే తెచ్చుకోవాల్సిన వ్యాపార సముదాయాలు చలి కారణంగా ఉదయం 10 తర్వాత తెరుచుకుంటున్నాయి. రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచే షాపులు రాత్రి 10 గంటల కన్నా ముందు కట్టేస్తున్నారు . అక్కడక్కడ ఉదయం 9 గంటల్లోపు కొన్ని షాపులు తెరుచుకుంటున్నప్పటికీ కొనుగోలు దారులు రాకపోవడంతో వెలవెల బోతున్నాయి. ఉదయం 11 గంటల తర్వాత షాపుల్లోకి జనాలు వస్తున్నారని వ్యాపారులు అంటున్నారు.
స్కూలుకు వెళ్లేందుకు మొండికేస్తున్న విద్యార్థులు..
చలి కారణంగా విద్యార్థులు నిద్రలేచి స్కూలుకు వెళ్లాలంటే మారాం చేస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. బుజ్జగించి, బెదిరించి పంపాల్సి వస్తోందని పేరెంట్స్ అంటున్నారు. చాలా మంది పిల్లలు చలి కారణంగా జలుబు, జ్వరంతో బాధపడుతున్నారని స్కూల్ యాజమాన్యం, పేరెంట్స్ అంటున్నారు.
అస్తమా పేషంట్లు, వృద్ధులు, చిన్నారులకు ప్రమాదం..
ఉష్ణోగ్రతలు విపరీతంగా తగ్గిన ఈ చలికాలంలో ఆస్తమా పేషంట్లు, వృద్ధులు, చిన్నారులకు ప్రమాదమని వైద్య నిపుణులు చెపుతున్నారు అనూహ్యంగా తగ్గుతున్న ఉష్ణోగ్‌రతలు పెరుగుతున్న దగ్గు, జలుబు బాధితులపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. వృద్ధులు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. రెండేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు ఈ చలి కారణంగా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో శ్వాసకోశ సంబంధిత సమస్యల తీవ్రత సాధారణ పరిస్థితులతో పోలిస్తే 20 శాతం నుంచి 30 శాతం పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. వృద్ధులపై చలి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. జలుబు కారణంగా ముక్కు కారడం ఉమ్మడి జిల్లాలో ఎక్కువ మందిలో కనిపిస్తుంది.
అ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ ఫెక్షన్ గా చెప్పబడే ఈ సమస్య ఎక్కువైతే ముక్కు కారడం దాటి ఊపిరి తిత్తుల్లోకి చల్లగాలి వెళితే వాయు నాళాలు కుచించుకు పోయి శ్వాస ఇబ్బందితో దగ్గు కూడా తీవ్రమవుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో ఆస్తమా ఉన్నవారు చలికి ఎక్కువగా ఎక్స్ ఫోజ్ అవుతే చలి ఎక్కువై బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ లు వస్తాయని డాక్టర్లు చెపుతున్నారు. స్కూల్ నుంచి రాగానే ఓ గంట సేపు ట్యూషన్ పూర్తి చేసుకుని రాత్రి వరకు ఫ్రెండ్స్ తో ఆడుకునే అలవాటున్న పిల్లలను నియంత్రించాల్సిన అవసరముంది. రాత్రి వేళల్లో పిల్లలు చల్లగాలిలో ఆడుకుంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయని ఆర్మూర్ పట్టణంలోని ప్రముఖ వైద్యుడు లైఫ్ హాస్పిటల్ యజమాని డాక్టర్ భాను రాంగిరి అన్నారు.