Harish Rao: పాట ఉన్నంత కాలం గద్దరన్న సజీవంగానే ఉంటారు.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

అర్ధశతాబ్దపు పోరాటం, కృషి గద్దరన్నదని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) వ్యాఖ్యానించారు.

Update: 2024-12-15 12:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అర్ధశతాబ్దపు పోరాటం, కృషి ప్రజా యుద్ధ నౌక గద్దరన్నదని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) వ్యాఖ్యానించారు. ఇవాళ సిద్దిపేటలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీపుల్స్ కాన్ఫరెన్స్ ప్రజా యుద్ధనౌక గద్దర్ (Gaddar) సాహిత్యం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గద్దర్ గొప్పతనం, పోరాటాన్ని రేపటి భావితరాలకు తెలియాలని ఆయన కుమారుడు సూర్యం గొప్ప నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఒక్కొక్క పువ్వును పేర్చి బతుకమ్మను ఏ విధంగా అయితే తయారు చేస్తామో.. సూర్యం గద్దర్ పాడిన ఒక్కొక్క పాటను పాటల బతుకమ్మగా పేర్చి అద్భుతంగా తయారు చేశారని కొనియాడారు. సిద్దిపేట కేంద్రంగా గద్దర్ పాటలను ఒక గ్రంధంగా అందించడం సంతోషంగా ఉందన్నారు.

ప్రతి పోరాటంలో గద్దర్

రైతాంగ పోరాటం, సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమం లాంటి ఐదు దశాబ్దాల కాలంలో జరిగిన ప్రతి పోరాటంలో గద్దర్ ఉన్నారని వెల్లడించారు. రైతులు, దళితుల హక్కుల కోసం పోరాటం, విప్లవం లాంటి ఏ పోరాటం లోనైనా గద్దరన్న పోరాటం వెనుక గొంతుకై నిలిచాడన్నారు. అది న్యాయం అనుకుంటే ఆ పోరాటానికి అండగా నిలిచారని, అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అందరితో కలిసి పనిచేసిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న కలిసి పోరాటం చేయడం తన అదృష్టమని తెలిపారు. చాలా సార్లు తన ఇంటికి వచ్చారని, కలిసి భోజనం చేసిన తీపి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర చాలా గొప్పదన్నారు. పొడుస్తున్న పొద్దు మీద.. అనే పాట వింటే రోమాలు నిక్కపొడిచేవని చెప్పారు. అలాంటి పాటలు గద్దరన్న పాడుతుంటే చూసే అదృష్టం తనకు దొరికిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కు అండగా నిలబడ్డారని తెలిపారు. 2016లో జీహెచ్ఎంసీ పారీశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపుపై నాటి సీఎం కేసీఆర్‌కు గద్దర్ లేక రాశారని, వెంటనే కేసీఆర్ వేతనాలు పెంచారని గుర్తుకు చేశారు. సిద్దిపేటలో గద్దర్ విగ్రహం పెట్టించే బాధ్యత తాను తీసుకోనున్నట్లు తెలిపారు. గద్దర్ డాక్యుమెంటరీకి సహకరిస్తానని హామీ ఇచ్చారు.

వంద ఉపన్యాసాలు గద్దర్ ఒక్క పాటతో సమానం

వంద ఉపన్యాసాలు గద్దర్ ఒక్క పాటతో సమానమని, అంత సులువుగా ప్రజలకు అర్థమయ్యే తీరులో ప్రజల గుండెల్లో చేరుకునేంతగా ఆయన పాట ఉండేదన్నారు. అలాంటి గద్దరన్న.. పాట ఉన్నంత కాలం గద్దరన్న సజీవంగానే ప్రజల మధ్య ఉంటారని అన్నారు. సమాజంలో అసమానతలు పోవాలంటే గద్దరన్న స్పూర్తి ఆలోచన విధానం కొనసాగించాలని పిలుపునిచ్చారు.

మన ముఖ్యమంత్రి తెలంగాణ ద్రోహి

తెలంగాణ తల్లిని మార్చారని మండిపడ్డారు. మన ముఖ్యమంత్రి గురించి తెలియనిది ఏముందని విమర్శించారు. ఆయన తెలంగాణ ద్రోహి అని అన్నారు. ఎన్నడూ జై తెలంగాణ అనని వాడు. ఏ నాడు తెలంగాణ ఉద్యమంలో కలిసి రాలేదని అన్నారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి బతుకమ్మను తీసివేశాడని వెల్లడించారు.

Tags:    

Similar News