TG Govt.: ఎల్ఆర్ఎస్ మెనీ ప్రాబ్లమ్స్! నత్తనడకన దరఖాస్తుల పరిష్కారం
లేఅవుట్ రెగ్యులరైజ్ స్కీం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కారంలో అనేక ప్రాబ్లమ్స్ తలెత్తుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: లేఅవుట్ రెగ్యులరైజ్ స్కీం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కారంలో అనేక ప్రాబ్లమ్స్ తలెత్తుతున్నాయి. అనుమానాలు, సందేహాలు, సమస్యలు పెరుగుతున్నాయి. 25 శాతం ఫీజు రాయితీ కల్పించినా.. చాలా మంది ఫీజు చెల్లించడానికి ముందుకు రావడంలేదు. ముందుకొచ్చేవారికీ సర్వర్ సమస్యలు వస్తున్నాయి. ఫలితంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, డీటీసీపీ పరిధిలో సాఫ్ట్ వేర్ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం కల్పించిన రాయితీ పొందడానికి ఈ నెల 30, 31 తేదీల్లో మాత్రమే అవకాశం ఉండడంతో ఫీజు చెల్లించేందుకు అధిక సంఖ్యలో దరఖాస్తుదారులు ప్రయత్నాలు చేస్తున్నాయి.
రూ. 500 కోట్ల ఆదాయం!
రాష్ట్ర వ్యాప్తంగా 25.67 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. వీటిలో సుమారు నిషేధిత భూములు, చెరువులు, కుంటలు, నీటి వనరులకు సంబంధించి, ఇతర సమస్యల కారణంగా 5.67 లక్షల దరఖాస్తులకు ఫీజు ఇంటిమేషన్ ఇవ్వలేదు. వీటిని తిరస్కరించినట్టేనని అధికారులు చెబుతున్నారు. దాదాపు 20,00,495 దరఖాస్తులకు అధికారులు ఫీజు ఇంటిమేషన్ లెటర్లు పంపించారు. వీరిలో 3,64,104 దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారు. ఒక్క మార్చి నెలలోనే 3.50 లక్షల మంది ఫీజు చెల్లించడం గమనార్హం. అంతకుముందు 14,104మంది మాత్రమే ఫీజు చెల్లించారు. కాగా, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.500కోట్ల ఆదాయం వచ్చినట్టు సమాచారం.
జీహెచ్ఎంసీలో కానరాని స్పందన
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం నత్తనడకన సాగుతున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,07,872 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 59,564 దరఖాస్తులకు ఫీజు ఇంటిమేషన్ లెటర్లను పంపించారు. అయితే ఇఁదులో ఇప్పటి వరకు ఫీజు చెల్లించింది 7,881 దరఖాస్తుదారులు మాత్రమే. దీంతో జీహెచ్ఎంసీకి రూ.103.46కోట్ల ఆదాయం వచ్చింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కరించడానికి జోనల్ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసిననా.. ఆశించిన స్థాయిలో స్పందన లేదని అధికారులు చెబుతున్నారు.
ఈ నెల 30, 31తేదీల్లోనూ చెల్లింపులు
సెలవు రోజులైనా ఈ నెల 30, 31 తేదీల్లోనూ ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో ఎల్‌ఆర్‌ఎస్ రుసుము చెల్లింపునకు ప్రభుత్వం మార్చి 31 వరకు అవకాశం ఇచ్చింది. ఈ లోపు చెల్లించిన వారికి రాయితీని ఇస్తుంది. ఈ నెల 30న ఉగాది, 31న రంజాన్ పండుగల దృష్ట్యా ప్రభుత్వం ఇది వరకే సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతోపాటు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు ప్రభుత్వం రంజాన్ సెలవులను రద్దు చేసింది. 30,31 తేదీల్లోనూ ఆఫీసులు పనిచేయనున్నాయని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ తెలిపింది.
మొత్తం దరఖాస్తులు - 25,67,107
ఫీజు ఇంటిమేషన్ ఇచ్చిన దరఖాస్తులు- 20,00,495
ఇప్పటి వరకు ఫీజు చెల్లించిన దరఖాస్తులు - 3,64,104
మార్చి నెలలోనే ఫీజు చెల్లించిన దరఖాస్తులు - 3,50,000