మోడీ అదానికే ప్రధాని..దేశ ప్రజలకు కాదు..
మోడీ దేశంలో రైతుల సమస్యలకు పరిష్కారం చూపడంలో వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, ప్రధానిగా దేశప్రజలకు కాకుండా కేవలం ఆదానికి మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
దిశ, కామారెడ్డి రూరల్ : మోడీ దేశంలో రైతుల సమస్యలకు పరిష్కారం చూపడంలో వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, ప్రధానిగా దేశప్రజలకు కాకుండా కేవలం ఆదానికి మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ అతిధి గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ అంటే ఈడీ, ఈడీ అంటే మోడీ అన్నట్టు దేశంలో పరిస్థితి ఉందని అన్నారు. ఇటీవల దేశంలో జరుగుతున్న సంఘటనలు మనదేశం ఇతర దేశాల ముందు తలవంచుకునే విధంగా ఉన్నాయన్నారు. రాముడు పాలించిన రామరాజ్యం ప్రస్తుతం పతనమవుతున్నదని అన్నారు.
రాజకీయాలు పక్కన పెట్టి తాను దేశ పౌరుడిగా మాట్లాడుతున్నానని అన్నారు. ప్రతిపక్షాలు బలంగా ఉన్నరాష్ట్రాల పైననే ఈడీ నోటీసులు వస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రఖ్యాతిని దేశ, విదేశాలకు తెలిసేలా చేసిన కవితక్కను 9 గంటలు ఈడీ విచారణ జరపడం సరైనదికాదని అన్నారు. బండి సంజయ్ ఒక తల్లికిపుట్టి ఉంటే ఈ విధంగా మాట్లాడడని అన్నారు. ఈ రకంగా మాట్లాడడం మాతృమూర్తిని అవమానించడమేనన్నారు. ఇప్పటికైనా మీరు జాగ్రత్తగా ఉండాలని, అందరికీ చీము, నెత్తురు ఉన్నాయని అన్నారు. మా సైన్యం బయటకు వస్తే మీరు ఒక్క కార్నర్ మీటింగ్ జరపరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీ బుద్దిన్ లు తదితరులు పాల్గొన్నారు.