మాల్ తుమ్మెద సొసైటీలో అధిక ధరలకు ఎరువు బస్తాల విక్రయాలు

మండలంలోని మాల్ తుమ్మెద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో సొసైటీ అధికారులు ఎరువు బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని శనివారం మండల రెవెన్యూ తహసీల్దార్ కు రైతులు ఫిర్యాదు చేశారు.

Update: 2024-08-17 16:01 GMT

దిశ, నాగిరెడ్డిపేట: మండలంలోని మాల్ తుమ్మెద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో సొసైటీ అధికారులు ఎరువు బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని శనివారం మండల రెవెన్యూ తహసీల్దార్ కు రైతులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తాండూర్ గ్రామానికి చెందిన రైతు మోహన్ రావు మాట్లాడుతూ మాల్ తుమ్మెద సొసైటీలో సొసైటీ అధికారులు ఐపీఎల్ పొటాష్ 50 కేజీల బస్తాను, మండలంలోని తాండూర్ సొసైటీలో 1570 రూపాయలకు విక్రయిస్తుంటే మాల్ తుమ్మెద సొసైటీలో మాత్రం 1600 రూపాయలకు విక్రయిస్తున్నారని, ఎందుకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని అడిగితే, మా ఇష్టం ఉన్న ధరలకు విక్రయిస్తాం మీరు తీసుకుంటే తీసుకోండి, లేకుంటే లేదు అని దురుసుగా సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు.

ఎరువు బస్తాలను అధిక ధరలకు విక్రయించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీలో రైతులకు ఎరువు బస్తాలను తక్కువ ధరలకు విక్రయించాల్సి ఉండగా అధిక ధరలకు విక్రయించడం పై మండల వ్యవసాయ శాఖ అధికారికి ఫిర్యాదు చేద్దామని వెళ్తే మండల వ్యవసాయ అధికారి లేకపోవడంతో, తహశీల్దార్ లక్ష్మణ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో తహశీల్దార్ సొసైటీ కార్యాలయానికి గిర్ధవార్ మహమ్మద్, జూనియర్ అసిస్టెంట్ సాయిలు లను పంపించి విచారణ జరిపించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో ఎరువు బస్తాలు, పురుగు మందులు సాధారణ ధరలకు విక్రయించాల్సి ఉండగా, మాల్ తుమ్మెద సొసైటీలో మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్న సొసైటీ అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు పైన చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.


Similar News