లైన్ మెన్ నిర్వాకంతో వ్యక్తి మృతి

విద్యుత్ శాఖలో అవినీతి పెచ్చుపెరుగుతుంది. విద్యుత్ శాఖలో సిబ్బంది, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

Update: 2024-03-15 15:19 GMT

దిశ ప్రతినిది, నిజామాబాద్ : విద్యుత్ శాఖలో అవినీతి పెచ్చుపెరుగుతుంది. విద్యుత్ శాఖలో సిబ్బంది, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ధర్మారంలో రెండు విద్యుత్ స్తంభాల ఏర్పాటు ప్రక్రియను కాంట్రాక్టర్ కు అప్పజెప్పకుండా లైన్ మెన్ చేపట్టిన పని ఒక కార్మికుడి ప్రాణాలు తీసింది. నగరంలోని ఇంద్రాపూర్ కు చెందిన అంజద్ (38) విద్యుత్ స్తంభాలు వేసే పనిలో కూలీగా పని చేస్తున్నాడు. ధర్మారంనకు చెందిన లైన్ మెన్ తన సొంత గ్రామంలో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన రెండువిద్యుత్ పోల్స్​ ఏర్పాటు పనులను చేపట్టాడు. సాధారణంగా సంబంధిత పనులను ప్రైవేట్ కాంట్రాక్టర్ కు అప్పజెబుతారు.

     ఈ విషయంలో డీఈ, ఏడీఈ, ఏఈల అనుమతి లేకుండా అలాంటి పనులు జరగవు. కానీ లైన్ మెన్ చొరవతో అక్కడ రెండు విద్యుత్ పోల్ లు ఏర్పాటు చేపట్టాడు. అందుకు ఇంద్రాపూర్ కు చెందిన లేబర్ లను రప్పించారు. విద్యుత్ పోల్ పై తీగలు బిగిస్తున్న క్రమంలో ఒక పోల్ పై ఉన్న అంజద్ కరెంట్ షాక్ తో కిందపడగా అతన్ని హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. బాధితుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

    అయితే ప్రైవేట్ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో జరగాల్సిన పనులను లైన్ మెన్ చేయడంతో అతన్ని బాధ్యుడ్ని చేసి చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అతన్ని తప్పించేందుకు కొందరు విద్యుత్ సంఘాల లీడర్లు రంగంలోకి దిగారు. గురువారం రాత్రి ఇంద్రాపూర్ లోని అతని ఇంటి వద్ద చర్చలు జరిపారు. బాధితుడి ప్రాణాల ఖరీదు రూ.8 లక్షలుగా నిర్ణయించారు. దీంతో సొమ్మును రెండు మూడు రోజుల్లో అడ్జెస్ట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దాంతో వివాదాన్ని సద్దుమనిగించేందుకు శాఖ పరంగా ప్రయత్నాలు జోరందుకున్నాయి.

నగరంలో లైన్ మెన్ కు కరెంట్ షాక్

నగరంలోని డి5 సెక్షన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద పనులు చేస్తున్న లైన్ మెన్ కు కరెంట్ షాక్ తగలింది. ఈ సంఘటన ఉదయం చోటు చేసుకుంది. సంబంధిత ట్రాన్స్ ఫార్మర్ ఇన్సివేటర్ పగిలిపోయింది. వర్షాకాలంలో అది పగిలిపోయినా నేరుగా ఏబీ స్వీచ్ కు సంబంధం లేకుండా విద్యుత్ కనెక్షన్ నేరుగా ఉండడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. లైన్ మెన్ నవీన్ కు తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 


Similar News