బార్ లుగా పర్మిట్ రూమ్స్.. అదొక్కటే ఇబ్బందంటున్న మందుబాబులు
కామారెడ్డిలో రిటైల్ మద్యం షాపుల వద్ద ఏర్పాటు చేసిన పర్మిట్ రూమ్లు బార్లను తలపిస్తున్నాయి. అన్నీ ఉన్నాయి కానీ.. బాత్రూమ్ లు మాత్రమే లేవని, ఆ వసతి కూడా కల్పించాలని మందుబాబులు డిమాండ్ చేస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
దిశ, కామారెడ్డి: జిల్లాలో రిటైల్ మద్యం షాపుల్లో ఏర్పాటు చేసిన పర్మిట్ రూములు బార్లను తలపిస్తున్నాయి. నిబంధనలను గాలికి వదిలేసి పెద్దపెద్ద రేకుల షెడ్లు వేసి బెంచీలు, బల్లలు వేసి యథేచ్ఛగా సిట్టింగులను నడిపిస్తున్నారు. ఆయా వైన్ షాపుల పక్కన, వెనకాల నివాస గృహాలు ఉన్నా పర్మిట్ రూములను నడిపిస్తున్నారు. నిర్ణీత కొలతల ప్రకారం.. ఒక చిన్న గదిలో మాత్రమే పర్మిట్ రూములను నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో ఎలాంటి బెంచీలు గానీ, బల్లలు గానీ వేయకుండా నిర్వహించాలి. కేవలం గ్లాసులు, మందు సీసాలు పెట్టుకునేందుకు మాత్రమే వాల్ చెక్కలు వేయాలి. కానీ ఒక్కో వైన్ షాపు యజమాని పెద్దపెద్ద షెడ్లను ఏర్పాటు చేసి సిట్టింగులను నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్, పోలీస్ శాఖాధికారులకు నెలనెలా మామూళ్లు ముట్టజెబుతూ బార్లను తలపించేలా పర్మిట్ రూములను నిర్వహిస్తున్నారనే ఆరోపణ ఉన్నాయి. వైన్ షాపులు బార్లను తలపిస్తున్నాయి. వైన్ షాపుల వద్ద ఏర్పాట్లు చేస్తున్న వసతులు బార్లలో కూడా ఉండటం లేదన్న చర్చ సాగుతోంది. బార్లను మైమరిపించేలా వైన్ షాపులు ఉండటం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా..? అదేనండి. వైన్ షాపులంటే వైన్స్ పక్కన ఏర్పాటు చేస్తున్న పర్మిట్ రూములన్నమాట. అన్ని వసతులు కల్పిస్తున్న ఆ పర్మిట్ రూముల వద్ద టాయిలెట్స్ లేకపోవడం మందుబాబులకు ఇబ్బందిగా మారుతోందని జోరుగా చర్చించుకుంటున్నారు.
బార్లతో పోలిస్తే వైన్స్ వద్ద ఏర్పాటు చేసిన పర్మిట్ రూములలో సకల వసతులు ఉండేలా వైన్స్ నిర్వాహకులు దృష్టి సారిస్తున్నారు. బార్లలో మందులోకి కావాల్సిన స్టఫ్ ఆర్డర్ వేసిన 20 నిమిషాల తర్వాత వస్తాయి. ఇక్కడ మాత్రం రెడీగా ఉంటాయి. వాటిని క్షణాల్లో తీసుకుని పర్మిట్ రూములోకి వెళ్లి కావాల్సినంత సేపు మద్యం సేవిస్తున్నారు. మందుబాబులు తాపీగా కూర్చోవడానికి బెంచీలు, టేబుల్స్ ఉండటంతో బార్లో కంటే పర్మిట్ రూములే బెటర్ అంటున్నారు మందుబాబులు.
టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయాలి
పర్మిట్ రూముల వద్ద తినడానికి, తాగడానికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మందుబాబులు కోరుతున్నారు. ఈ విషయంపై ఇటీవల మందుబాబుల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది. గంటల తరబడి పిచ్చాపాటిగా కబుర్లు చెప్పుకుంటూ మద్యం సేవిస్తున్న సమయంలో అర్జంట్ గా బాత్ రూమ్ వస్తే మాత్రం బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుందని మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్మిట్ రూముల వద్దే టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పర్మిట్ రూముల్లో టేబుల్స్ పక్కనే యథేచ్ఛగా మూత్ర విసర్జన చేస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతుందని మందుబాబులు ఆరోపిస్తున్నారు.
తినుబండారాలపై అధికారుల పర్యవేక్షణ కరువు
పర్మిట్ రూముల్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్న తినుబండారాలపై సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విక్రయదారులు ఇష్టానుసారంగా కుళ్లిపోయిన, నాసిరకమైన వస్తువులు విక్రయిస్తున్నారని మందుబాబులు పేర్కొంటున్నారు. ఒకరోజు క్రితం మిగిలిపోయిన గూడాలు, బెబ్బేర్లు, శనగలు, పల్లీలు, కోడిగుడ్లు తదితర దుర్వాసన వెదజల్లుతున్న తినుబండారాలను యథేచ్చగా విక్రయిస్తున్నారని, ఇవి వద్దు బయట నుంచి తెచ్చుకుంటామంటే అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్తీ నూనెలు, నాసిరకమైన ఆహార పదార్థాలు పెడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న పర్మిట్ రూమ్ విక్రయదారులపై సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు.
విచ్చలవిడిగా అనుమతులు
జిల్లా కేంద్రంలో మద్యం షాపుల వద్ద ఎక్సైజ్ అధికారులు విచ్చలవిడిగా పర్మిట్ రూములకు అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిసస్తున్నాయి. అనుమతులు ఇచ్చి వసతులు ఎలా ఉన్నాయో పర్యవేక్షించడంలో ఎక్సైజ్ అధికారులు విఫలమవుతున్నారు. పర్మిట్ రూములను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ వసతులను పరిశీలించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకోకుండా వసతులు ఎలా ఉన్నాయో కూడా అధికారులు చొరవ తీసుకోవాలని మద్యం ప్రియులు కోరుతున్నారు.