ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లుగా.. నాయకులు తలుచుకుంటే ప్రభుత్వ భూముల్లో నుంచి ఇష్టానుసారంగా మట్టిని తరలించొచ్చు..మమ్మల్ని అడిగేది ఎవరు...అన్నట్టుగా మట్టి దోపిడీ వ్యవహారం సాగుతోంది.

Update: 2024-10-07 10:23 GMT

దిశ, కామారెడ్డి : రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లుగా.. నాయకులు తలుచుకుంటే ప్రభుత్వ భూముల్లో నుంచి ఇష్టానుసారంగా మట్టిని తరలించొచ్చు..మమ్మల్ని అడిగేది ఎవరు...అన్నట్టుగా మట్టి దోపిడీ వ్యవహారం సాగుతోంది. కామారెడ్డి మండలం శాబ్దిపూర్ శివారులోని గూడెం రోడ్డు పక్కన గల అసైన్డ్ భూమి నుంచి సుమారు సంవత్సర కాలంగా యథేచ్చగా మట్టి తరలిస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా మట్టి తవ్వకాలు చేపడుతూ..అక్రమ రవాణాకు తెరతీశారు. ప్రభుత్వ భూములు అమ్మరాదు, కొనరాదు అనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి సర్వేనెంబర్ 38 లోని ప్రభుత్వ భూమిని సదరు నాయకుడు రెండెకరాలు కొనుగోలు చేశాడు. అందులో నుంచి గత సంవత్సరాలుగా టిప్పర్లతో మట్టి తరలిస్తూ..యథేచ్చగా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అధిక లోడ్ టిప్పర్లతో మట్టి తరలించడంతో.. గ్రామంలో వేసిన రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయని పేర్కొన్నారు. మట్టి తరలింపు, భూమి కొనుగోలు, రోడ్ల ధ్వంసం విషయాలపై మైనింగ్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల సహకారంతోనే సదరు వ్యక్తి యదేచ్చగా రాత్రి పగలు మట్టి తరలిస్తున్నాడని ఆరోపించారు. ఈ అక్రమ మట్టి రవాణాపై ఎవరూ దృష్టి సారించకపోవడంతో..వారికి భయంలేకుండా పోయిందన్నారు. జేసిబిలతో మట్టిని తవ్వుతూ.. టిప్పర్లతో రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. దీంతో ఆ ప్రాంతంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని స్థానికులు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలతో లక్షలాది రూపాయల ఖనిజ సంపద తరలిస్తున్న.. అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని తెలిపారు. కామారెడ్డి తాహసీల్దార్ కు ఫిర్యాదు చేయగా..మట్టిని తవ్వుతున్న వాహనాలు సీజ్ చేస్తామని పేర్కొన్నట్టు స్థానికులు తెలిపారు.


Similar News