పక్షవాతంతో కొడుకు.. ఆసరా సాయం కోసం తల్లి ఎదురు చూపులు

తల్లి పండుటాకు. కుమారునికి పక్షవాతం నాలుగు పదుల వయసు దాటుతున్నా.. లేచి నిలబడలేని దయనీయ స్థితి.

Update: 2024-03-15 03:26 GMT

దిశ, తాడ్వాయి : తల్లి పండుటాకు. కుమారునికి పక్షవాతం నాలుగు పదుల వయసు దాటుతున్నా.. లేచి నిలబడలేని దయనీయ స్థితి. తనె ఒకరికి ఆసరాగా ఉండాల్సిన స్థితిలో.. మంచం పట్టిన కొడుకును అమ్మే ఆలనాపాలనా చూసుకుంటోంది. కష్టాలన్నింటినీ పంటి బిగువున భరిస్తూ కాలం వెళ్లదీస్తున్న ఆ తల్లీ కుమారుడిని.. కాలం పరీక్ష పెడుతూనే ఉంది. కొడుకు వికలాంగుల పింఛను గత కొన్ని సంవత్సరాలుగా వచ్చి ఆగిపోవడంతో పలుమార్లు దరఖాస్తు చేసినా అధికారుల నాయకుల చుట్టూ తిరిగినా పెన్షన్ రాకపోవడంతో పూట గడవటమే కష్టంగా మారింది. వికలాంగుల పెన్షన్ కోసం ఆ తల్లీకుమారుడు.. దీనంగా వేచి చూస్తున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడి గ్రామానికి చెందిన బిస్మయ్య (49) కొద్దీ రోజులు హోటల్, ఆటో నడుపుకుంటూ సాఫీగా జీవనం సాగిస్తుండగా పక్షవాతం రావడంతో ఆ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి.

పక్షవాతం రావడంతో కాళ్ళు చేతులు చచ్చుపడిపోవడంతో కాలకృత్యాలు చేసుకోలేని దయనీయ పరిస్థితి చోటు చేసుకుంది. పెన్షన్ డబ్బులు వస్తే గాని పూట గడవని దుస్థితి.2019 వరకు పెన్షన్ డబ్బులు వచ్చాయి. కానీ గత 4సంవత్సరాల నుండి పెన్షన్ డబ్బులు రావడం లేదని గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే సురేందర్‌ను సంప్రదించిన ఫలితం లేదని వాపోయారు. దీంతో 80 శాతం అంగవైకల్యం ఉన్న సదరం క్యాంప్ పడ్డప్పుడల్లా అధికారుల చుట్టూ తిరిగిన పెన్షన్ మంజూరు కాకా డబ్బులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్ననాటి మిత్రులు బిస్మయ్య పరిస్థితి చూసి ఎవరికీ తోచిన సహాయం వారు చేస్తూ ఆసరాగా నిలుస్తున్నారని అన్నారు. మంచానికి పరిమితం అయిన వ్యక్తికి ఆ తల్లి కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. తమకు పెన్షన్ డబ్బులు ఇప్పించండి మహప్రభో అంటూ వేడుకుంటున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్ చొరువ చూపి పెన్షన్ మంజూరు చేసి ఆర్థికంగా సహాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.


Similar News