MLC Kalvakuntla: సంక్షేమానికి స్వర్ణయుగం కేసీఆర్ పాలన.

తెలంగాణ సీఎం కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణ యుగంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

Update: 2023-06-09 15:49 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణ యుగంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సంక్షేమ సంబరాల్లో డిచ్ పల్లి మండలం నడిపల్లి గ్రామ శివారులో జీ కన్వెన్షన్ హాల్లో గొల్ల, కుర్మ లబ్ధిదారులకు "గొర్రెల పెంపక అభివృద్ధి పథకం రెండో విడత భాగంలో 75 శాతం సబ్సిడీతో నేడు గొర్రెల యూనిట్ల పంపిణీ, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, బీసీ కార్పొరేషన్, కులాంతర వివాహ లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి రూరల్ ఎమ్మేల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అధికారుల కష్టం, ప్రజా ప్రతినిధుల ఆలోచన వల్లే రాష్ట్రం సంక్షేమ రంగంలో నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. బీజేపీకి సంస్కారం, సంక్షేమం రెండూ తెలియవని విమర్శించారు. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో ఎంగిలి చేతితో మెతుకులు వేసేలా పెన్షన్లు ఇచ్చారని, కానీ మన తెలంగాణలో అమ్మ ప్రేమ లాగా కడుపు నింపే విధంగా పెన్షన్లు ఇచ్చుకుంటున్నామన్నారు. సబ్బండ వర్గాలు చల్లగా ఉండాలని అమలు చేసే కార్యక్రమాలే సంక్షేమ కార్యక్రమాలను, నిరుపేదలు ఆత్మాభిమానంతో బ్రతికేలా చేయటమే నిజమైన సంక్షేమమన్నారు.

జిల్లాలో 10 వేల మంది ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్నామని, ఎంతో మంది కిడ్నీ పేషంట్ల కోసం జిల్లాలో 33 డయాలలిస్ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని, అది సీఎం కేసీఆర్ వల్లనే సాధ్యమైందన్నారు. జిల్లాలో 96 వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కేసీఆర్ అంటే మావాడు అని రైతులు గర్వంగా చెప్పుకుంటున్నరని, విత్తు నాటే దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులకు అండగా ఉంటున్న గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు.

జిల్లాలో 2.60 లక్షల మందికి రైతు బంధు ఇస్తున్నామని, ఇప్పటి వరకు రూ.2,385 కోట్లను రైతు బంధు ద్వారా అందించామని ఆమె వివరించారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారంతో లక్ష మంది బీడీ కార్మికులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఘనత కవితదేనని అన్నారు.  రాష్ట్ర ప్రజలు బాగుండాలని.. ప్రజలంతా నా వాళ్లేనని ఆలోచించే వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్, ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News